Breaking News

ఏడాదిలోపే హిడ్మా చరిత్రలో కలిసిపోవడం పక్కా.. ప్లాన్ సిద్దం: సీఆర్పీఎఫ్ డీజీ సంచలన వ్యాాఖ్యలు


గతవారం చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను మావోయిస్ట్‌లు ట్రాప్‌చేసి 24 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కీలక భూమిక పోషించిన మావోయిస్ట్ గెరిల్లా దళ కమాండర్ మడ్వి హిడ్మాను భద్రత బలగాలు హిట్‌లిస్ట్‌లో చేర్చాయి. హిడ్మా త్వరలో చరిత్రలో కలిసిపోతాడంటూ సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలంలో మావోయిస్టులను కూకటివేళ్లతో సహా ఏరిపారేస్తామని, ఇందుకు ఓ పకడ్బందీ కార్యాచరణను ఇప్పటికే ప్రారంభించామని ఆయన వివరించారు. ఓ జాతీయ మీడియాకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఆర్పీఎఫ్ డీజీ మాట్లాడుతూ.. మావోయిస్టులు ఇప్పటికే తమ ఉనికిని కోల్పోతున్నారని అన్నారు. ‘‘మా వాళ్లు మారుమూల అటవీ ప్రాంతాల్లోనూ శిబిరాలను ఏర్పాటు చేశారు. త్వరలో మిగతా ప్రాంతాలకూ చొచ్చుకుపోతారు... ఇక మావోయిస్టులు తప్పించుకోవడం అసాధ్యం’’ అని పునరుద్ఘాటించారు. బిజాపూర్ ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలకు ఎక్కువ నష్టం వాటిళ్లిందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. మావోయిస్టుల వైపు ప్రాణనష్టం భారీగానే ఉందని వ్యాఖ్యానించారు. ‘వాళ్లు (నక్సల్స్) గోడుచాటున దాక్కుని పోరాటం చేస్తున్నారు.. ప్రస్తుతం వారిని ఓ చిన్న ప్రాంతానికే పరిమితం చేశారు.. వాళ్లను అంతం చేయడం లేదా పారిపోయేలా చేయడం ఏదో ఒకటి జరుగుతుంది.. ఒకప్పుడు 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నియంత్రణలో ఉంచుకున్న వాళ్లు.. ప్రస్తుతం 20 చదరపు కిలోమీటర్లకే పరిమితమయ్యారు’ అని అన్నారు. ఆ ప్రాంతాల్లో మావోయిస్టులను ఏడాదిలోపే కూకటివేళ్లతో పెకిలించివేస్తామని హెచ్చరించారు. మరి హిడ్మా విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నకు బదులిస్తూ.. 100 శాతం కచ్చితమని చెప్పలేను కానీ, ఇటువంటివాళ్లు చరిత్రలో కలిసిపోవడం ఖాయం అన్నారు. మావోయిస్టుల ఉచ్చులో భద్రత బలగాలు చిక్కుకున్నాయనే ప్రచారాన్ని కూడా సింగ్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగా బిజాపూర్ ఎన్‌కౌంటర్‌లో మాస్టర్ మైండ్ హిడ్మా హస్తం ఉన్నట్టు భద్రత బలగాలు స్పష్టతకు వచ్చాయి.


By April 10, 2021 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/people-like-maoist-madvi-hidma-soon-become-history-says-crpf-chief/articleshow/81999785.cms

No comments