Breaking News

మాస్క్ వేసుకోలేదని అడిగితే.. మా ఆయనకు ముద్దిస్తా ఆపుతావా? అంటూ పోలీసులపై ఆగ్రహం!


దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతమవుతోంది. దేశరాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. కేసుల సంఖ్య భారీగా పెరగడానికి ప్రజల నిర్లక్ష్యం కూడా ఓ కారణం. కోవిడ్ నిబంధనలు అస్సలు పాటించడం లేదు. మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని గగ్గోలు పెడుతున్నా ఎవరూ చెవికెక్కించుకోవడం లేదు. ఢిల్లీలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో వారాంతపు లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీ వీధుల్లో ఓ జంట.. షికారుకెళ్లింది. తమ సరదా కోసం నిబంధనలను ఉల్లంఘించి ఎటువంటి లాక్‌డౌన్ పాస్‌లు లేకపోయినా షికారుకు వెళ్లారు. కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా కారులో చక్కర్లు కొట్టారు. ఇదేమని ప్రశ్నించిన పోలీసులతో అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. కర్ఫ్యూ పాస్ లేకుండా నిబంధనలు ఉల్లంఘించి కారులో షికారు చేస్తున్న జంటను పోలీసులు ఆపారు. కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదని అడిగితే వాగ్వాదానికి దిగారు. ‘‘మా కారు ఎందుకు ఆపారు?.. నా కారులో నా భార్యతో లోపలి ఉన్నాను’’ అని సదరు వ్యక్తి దురుసగా సమాధానం ఇచ్చాడు. ‘‘ఇప్పుడు నా భర్తకు ముద్దిస్తా.. నన్ను ఆపుతావా?’’ అంటూ అతడి భార్య పోలీసులపై ఫైర్ అయింది. కారులో ఉన్నా మాస్క్ పెట్టుకోవాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టు వెలువరించిన ఆదేశాల గురించి చెబుతున్నా పట్టించుకోలేదు. ధైర్యముంటే మాపై చర్యలు తీసుకోండి అని రెచ్చగొట్టారు. ఇదే సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ అక్కడకు చేరుకుని ఆమెను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తిని పంకజ్ దత్తాగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. సోమవారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. అతడి భార్య అభా గుప్తాను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో గడచిన 24 గంటల్లో 25వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం వారాంతపు లాక్‌డౌన్‌లు అమలు చేస్తోంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై శనివారం 569, ఆదివారం 2,369 కేసులు నమోదయ్యాయి. వీరిలో 323 మందిని అరెస్ట్ చేశారు.


By April 19, 2021 at 09:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lockdown-delhi-couple-misbehaves-with-cops-over-weekend-curfew-check-video-viral/articleshow/82137928.cms

No comments