Breaking News

మద్రాసు హైకోర్టులో ఈసీ పిటిషన్.. ఆ విషయంలో మీడియాను నిరోధించాలని అభ్యర్థన!


దేశంలో కరోనా వ్యాప్తికి ఎన్నికల కమిషన్‌ను బాధ్యులు చేసి, అధికారులపై హత్యకేసు నమోదుచేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టుకు ఈసీ శుక్రవారం కీలక అభ్యర్థన చేసింది. మౌఖిక పరిశీలన ద్వారా రిపోర్టింగ్ చేయకుండా మీడియాను నిరోధించాలని కోరింది. అంతేకాదు, రాష్ట్రాలలో కోవిడ్ వ్యాప్తికి ఎన్నికల ప్రచారం ఒక ముఖ్యమైన కారకమని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదని వాదించింది. ‘‘ఎటువంటి ఆధారాల్లేకుండా మౌఖికంగా మీడియాలో వచ్చిన నివేదికలే ఈ పరిస్థితికి కారణమని తన అఫిడ్‌విట్‌లో పేర్కొంది. ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగ బాధ్యతను అప్పగించిన స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా భారత ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠను ఈ నివేదికలు దెబ్బతీశాయి’’అని ఆరోపించింది. పశ్చిమ బెంగాల్‌లో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌పై మీడియా రిపోర్ట్ ఆధారంగానే హత్యానేరం ఆరోపణలపై పోలీస్ కేసు నమోదయ్యిందని తెలిపింది. ‘‘ విచారణను రికార్డ్ చేయడానికి న్యాయస్థానం ఎవరినీ అనుమతించరాదు.. ప్రత్యేకించి వివరణాత్మక ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చినప్పుడు.. ఏప్రిల్ 4 న తమిళనాడులో ప్రచారం ముగిసినప్పటి నుంచి న్యాయస్థానం అలాంటి పరిశీలనలు చేసిన సందర్భం లేదు’’ అని ఈసీ వాదించింది. ‘‘అంతేకాదు, ఎన్నికల లెక్కింపులో కోవిడ్ నిబంధనలపై కలకత్తా, కేరళ హైకోర్టులు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి.. కేరళ, పశ్చిమ్ బెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్నికల ప్రకటన వెలువడేసరికి తక్కువ సంఖ్యలో కేసులు ఉన్నాయి’’ అని పేర్కొంది. ‘‘మార్చి 20- ఏప్రిల్ 4 మధ్య ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు.. ఎన్నిక జరగని రాష్ట్రాలతో పోల్చితే కోవిడ్ కేసులు పెరగడానికి ప్రచారం ఒక ముఖ్యమైన కారకం కాదని తెలుస్తోంది.. కోర్టు ఏకపక్షంగా పేర్కొన్న దానికంటే చాలా తక్కువ’’ అని తెలిపింది. ఎన్నికలు జరగని మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీలో భారీగా కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. కాబట్టి, రెండో దశ కోవిడ్ వ్యాప్తికి ఈసీ ఎటువంటి బాధ్యులుకాదని, అధికారులపై ఎటువంటి కేసులు నమోదుచేయరాదని కోరింది.


By April 30, 2021 at 12:12PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/stop-media-reporting-of-oral-observations-election-commission-to-madras-high-court/articleshow/82323467.cms

No comments