Breaking News

ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు .. నలుగురు సహా ఏడు మూగజీవాలు సజీవదహనం


ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు చెలరేగి నలుగురు వ్యక్తులు సహా ఏడు మూగజీవాలు సజీవదహనమయ్యాయి. మొత్తం 62 ఎకరాల మేర మంటల వ్యాపించడంతో వాటిని అదుపుచేయానికి అగ్నిమాపక సిబ్బంది, అటవీ దళాలు రంగంలోకి దిగాయి. దాదాపు 12 వేల మంది సహాయక సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటి వరకూ రూ.37 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్టు ఫైర్ విభాగం చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో పాల్గొనాలని కేంద్రం ఆదేశించింది. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ కూడా పంపుతున్నట్టు తెలిపింది. ఘటన గురించి ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్‌కు ఫోన్ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పరిస్థితి గురించి చర్చించారు. అటు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రావత్ అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. తరుచూ రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, నియంత్రించడానికి ఓ వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌తో ఇటీవలే జరిగిన భేటీలో సీఎం వ్యాఖ్యానించారు. ఏటా ఏప్రిల్‌లో అడవికి నిప్పుంటుకునే ఘటనలు సాధారణంగా మారిపోయాయి. ఈ సమయంలో గరిష్ఠస్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. కానీ, ఈ ఏడాది శీతాకాలంలోనే పలు జిల్లాల్లోని అడవుల్లో మంటలు చెలరేగాయి. నైనిటాల్, అల్మోరా, తెహ్రీ, పౌరీ వంటి ప్రాంతాల్లో అడవులకు నిప్పంటుకుంది. గతేడాది 172 హెక్టార్టలో మంటలు వ్యాపిస్తే, ఈ ఏడాది ఇప్పటి వరకు 1290 హెక్టార్టు అగ్నికి ఆహుతయ్యాయి. గత 48 గంటల్లోనే 39 చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 983 ఘటనలు నమోదయ్యాయి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు చెలరేగుతుండగా.. మే, జూన్‌లో మరింత ఉద్ధృతంగా ఉంటాయి. శీతాకాలంలో వర్షపాతం తక్కువగా నమోదుకావడం, కరోనా కారణంగా లాక్‌డౌన్ వల్ల అడవుల్లో సిబ్బంది కదలికలపై ఆంక్షలు కొనసాగడంతో మంటలకు కారణమయ్యే వ్యర్థాలు పేరుకుపోయానని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. గతేడాది 172 హెక్టార్లు , 2019లో 2,981 హెక్టార్లు, 2018లో 4,480 హెక్టార్టు, 2017లో 1,228 హెక్టార్లు, 2016లో 4,433 హెక్టార్లు, 2015లో 701 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి తగలబడింది.


By April 04, 2021 at 03:20PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/four-people-and-seven-animals-lost-their-lives-in-uttarakhand-forest-fire-broke-out/articleshow/81897291.cms

No comments