Breaking News

రెండ్రోజుల్లో వెయ్యికిపై కేసులు.. కుంభమేళాలో కరోనా వైరస్ విజృంభణ


ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కేవలం రెండ్రోజుల్లోనే దాదాపు వెయ్యి మందికి పైగా భక్తులు కరోనా బారిన పడ్డారంటేనే పరిస్థితి అర్ధమవుతోంది. సోమవారం 408మందికి పాజిటివ్ రాగా.. మంగళవారం మరో 594 మందికి వైరస్ సోకింది. కుంభమేళాకు రోజూ లక్షలాది మంది తరలివస్తున్నారు. దీంతో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడం వైద్య సిబ్బందికి వీలు కావడం లేదు. భక్తులు కరోనా నిబంధనలను పట్టించుకోకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమవుతోంది. సోమవారం ఒక్కరోజే 28 లక్షల మంది మేళాకు హాజరైనట్లు అంచనా. అయితే ఆదివారం రాత్రి 11.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు కేవలం 18,169 మందికి మాత్రమే టెస్టులు చేయగలిగారు. అయితే కుంభమేళా సూపర్‌ స్ర్పెడర్‌ ఈవెంట్‌ కాదని అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం మేళాను సందర్శించిన వారిలో 53 వేల మందికి అధికారులు టెస్టులు నిర్వహించగా పాజిటివ్ రేటు 1.5శాతం మాత్రమే ఉందని ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. కుంభమేళాకు వచ్చేవారిలో 90 శాతం మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి వెంటనే వెళ్లిపోతారని, కాబట్టి వారి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం లేదని అధికారులు తెలిపారు. లక్షల మంది భక్తులు వచ్చే కుంభమేళాలో కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడటం అసాధ్యమని అభిప్రాయపడుతున్నారు.


By April 14, 2021 at 12:46PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/1000-above-corona-cases-registered-within-two-days-in-haridwar-kumbh-mela/articleshow/82062564.cms

No comments