Breaking News

జవాన్ మృతికి సైన్యం ప్రతీకారం.. ఐఈడీతో ఉగ్రవాదులు బయటకు రప్పించి..


జమ్మూ కశ్మీర్‌లో మరోసారి సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు ఉగ్రవాదులు గురువారం శ్రీనగర్ శివారులో బీజేపీ నేత అన్వర్‌ ఖాన్‌ ఇంటిపై దాడికి పాల్పడినవారేనని గుర్తించారు. గురువారం జరిగిన ఉగ్రదాడిలో నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాల్గొన్నారు. నలుగురిలో ఒకరు బురఖాలో రాగా.. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్‌ అమరుడయ్యాడు. కాకపొర వద్ద ఓ మూడంతస్తుల భవనంలో ముగ్గురు ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకుని కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో సైన్యం అప్రమత్తమయ్యింది. వెంటనే సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో భీకర కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతం మొత్తం కాల్పులతో దద్ధరిల్లింది. బీజేపీ నేత ఇంటిపై దాడి తర్వాత ఉగ్రవాదుల కోసం సైన్యం వేట ఆరంభించింది. ముష్కరలు కాకపొరలోని గత్ మోహల్లాలో ఉన్నట్టు గుర్తించారు. కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఇక, అన్వర్ ఖాన్ నివాసంపై దాడిలో పోలీస్ అమరుడు కాగా.. అతడి వద్ద నుంచి రైఫిల్‌ను ముష్కరులు తీసుకెళ్లారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ‘మూడంతస్తుల భవనంలో దాక్కున్న ఉగ్రవాదులను బయటకు రప్పించడానికి ఆ ఇంటిలోని ఓ భాగాన్ని ఐఈడీతో పేల్చారు. కొద్దిగంటలు భీకర కాల్పుల తర్వాత ముష్కరులు హతమయ్యారు’ అని ఓ పోలీస్ అధికారి తెలిపారు. గత మూడు నెలల్లో 20 మంది వరకు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. గత కొద్దివారాలుగా ఉగ్రవాదుల దాడులు పెరుగుతున్నాయి.


By April 02, 2021 at 03:11PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-terrorists-killed-in-encounter-two-have-involved-attacked-bjp-leaders-home/articleshow/81871294.cms

No comments