Breaking News

కరోనాతో మాజీ మంత్రి, జేడీయూ ఎమ్మెల్యే మృతి


కరోనా వైరస్ మహమ్మారికి మరో ప్రజాప్రతినిధి బలయ్యారు. కరోనా వైరస్ బారినపడ్డ బిహార్ డాక్టర్ మేవాలాల్ చౌధురి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఎమ్మెల్యే మేవాలాల్ ఛౌదురికి మూడు రోజుల కిందట కోవిడ్ నిర్ధారణ కావడంతో చికిత్స కోసం పట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చేరారు. ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడటంతో ఆయనను ఐసీయూలో చేర్పించారు. అయితే, పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. గతేడాది నవంబరులో జరిగిన బిహార్ శాసనసభ ఎన్నికల్లో ముంగేర్ జిల్లా తారాపూర్ నియోజకవర్గం నుంచి మేవాలాల్ ఛౌదురి విజయం సాధించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మేవాలాల్ నితీశ్ క్యాబినెట్‌లో విద్యా శాఖ బాధ్యతలను చేపట్టారు. అయితే, మూడు రోజులకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. భాగల్‌పూర్‌ వ్యవసాయ వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా 2010-15 మధ్య పనిచేసిన మేవాలాల్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంతో మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. లంచం తీసుకుని అర్హతలేని వారికి యూనివర్శిటీలో ప్రొఫెసర్లు, జూనియర్‌ సైంటిస్టులుగా నియమించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. వర్సిటీలో జరిగిన అవకతవకలపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీంతో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 2017లో ఆయణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం అక్కడ 8,690 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌లో రికవరీ రేటు కంటే యాక్టివ్ కేసులు రేటు అధికంగా ఉంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడమే ఇందుకు కారణం.


By April 19, 2021 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jdu-mla-and-former-education-minister-mevalal-chaudhary-passed-away-due-to-covid-19/articleshow/82137360.cms

No comments