Breaking News

పేదలకు గుడ్ న్యూస్.. త్వరలో మరో ప్యాకేజీని ప్రకటించనున్న కేంద్రం!


దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ తీవ్రత దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)పై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం జీడీపీ వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం కన్నా తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. వైరస్‌ కట్టడికి గతంలో మాదిరిగా లాక్‌డౌన్‌‌కు బదులు ప్రజలు భౌతిక దూరం పాటించేలా నిబంధనలను కఠినంగా అమలు చేయడమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలను సృష్టికి మౌలిక వసతుల కల్పన రంగంలో పెట్టుబడులను అధికం చేసే ఆలోచన ఉన్నప్పటికీ కర్మాగారాల్లో ఆంక్షలు, వలస కూలీలు స్వస్థలాలకు తిరిగి వెళ్లడం వంటి కారణాలతో అది సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. స్వస్థలాలకు చేరుకుంటున్న వలస కూలీలకు అక్కడే పనులు కల్పించేలా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల చేయడమే ఉత్తమ మార్గంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఉపాధిహామీ పథకానికి రూ.73 వేల కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమాన్ని తక్షణమే అమలు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు కూలీలకు ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే విషయాన్నీ ఆర్థిక శాఖ చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖలు, పరిశ్రమల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తోందని సమాచారం. రెండో దశ వ్యాప్తితో జీవనోపాధి కోల్పోయిన పేదలకు ఈ ప్యాకేజీ వల్ల ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కోవిడ్ మొదటి దశలో మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టే వేయడానికి గతేడాది కేంద్రం లాక్‌డౌన్ విధించడంతో ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజీ కింద రూ.20 లక్షల కోట్లు విడుదల చేసింది. ఇందులో ఎంఎస్ఎంలకు రూ.3.70 లక్షల కోట్లు, ఎన్‌బీఎఫ్‌సీకి రూ.75,000 కోట్లు, విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.90,000 కోట్లు, వలస కార్మికులు, పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు, ఉపాధి హామీ పథకం కోసం రూ.15,000 కోట్లు కేటాయించారు. రెండోసారి మహమ్మారి విరుచుపడటంతో ఆర్ధిక వ్యవస్థపై ముఖ్యంగా బ్యాంకులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. లాక్‌డౌన్ తరహా నిబంధనలు, కర్ఫ్యూలు, ప్రయాణాలపై నిషేధం, మాల్స్ మూసివేత వంటివి పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. గతవారం రేటింగ్ సంస్థ ఫిట్చ్ అంచనా ప్రకారం.. 80 శాతం కొత్త కేసులు ఆరు ప్రముఖ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి..బ్యాంకింగ్ సెక్టార్ రుణాలు దాదాపు 45 శాతం ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి.


By April 16, 2021 at 09:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-working-on-a-stimulus-package-to-deal-with-second-wave-of-coronavirus/articleshow/82095779.cms

No comments