Breaking News

రైళ్లు, రైల్వే స్టేషన్‌లో మాస్క్ ధరించకున్నా.. ఉమ్మినా రూ.500 ఫైన్


దేశంలో కరోనా రక్కసి మరోసారి కోరలు చాస్తోంది. రికార్డుస్తాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. గత మూడు రోజుల నుంచి వరుసగా రోజూ రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు బయటపడటం ఆందోళనకు గురిచేస్తోంది. కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.33 లక్షల మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 1,384 మంది బలయ్యారు. కరోనా ఇంతగా విజృంభిస్తున్నా ప్రజల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం వంటి నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించి, మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలని అధికారులు, ప్రభుత్వాలు, నిపుణులు పదే పదే విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. మాస్క్‌లు ధరించకుండా బయటకు వస్తే పలు రాష్ట్రాలు జరిమానాలు విధిస్తున్నాయి. తాజాగా, రైల్వే శాఖ కోవిడ్ నిబంధనలపై కీలక ఆదేశాలు జారీచేసింది. రైళ్లు, రైల్వే స్టేషన్‌లలోనూ మాస్క్ ధరించకపోయినా, ఉమ్మినా జరిమానా కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించి మాస్క్ ధరించకున్నా, ఉమ్మినా రూ.500 జరిమానా వసూలు చేస్తామని పేర్కొంది. ఈ ఆదేశాలు ఆరు నెలల వరకూ అమలులో ఉంటాయని తెలిపింది. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధికంగా కోవిడ్ కేసులు భారత్‌లోనే నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోజువారీ కేసుల్లో అమెరికాను భారత్ త్వరలో అధిగమించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ రెండు లక్షలకుపైగా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. కానీ, ప్రస్తుతం భారత్‌లో పాజిటివ్ కేసులు పదిహేను రోజులుగా లక్షల కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. అక్కడ రోజుకు 60వేల పైనే కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఏప్రిల్‌ 14 రాత్రి 8 గంటల నుంచి 15 రోజుల పాటు ‘జనతా కర్ఫ్యూ’ విధించింది. రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమలుచేస్తోంది


By April 17, 2021 at 02:09PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/spitting-not-wearing-of-mask-will-attract-fine-up-to-rs-500-says-railway/articleshow/82115876.cms

No comments