Breaking News

48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ.. ఆ పదవి చేపట్టనున్న రెండో తెలుగు వ్యక్తిగా రికార్డు


తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ (ఎన్వీ రమణ)ను నియామకం ఖరారయ్యింది. ఈ మేరకు రాష్ట్రప్రతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం లభించడంతో న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పదవీకాలం ఏప్రిల్ 23న ముగియనుండగా.. కొత్త సీజేఐగా జస్టిస్‌ ఎన్వీ రమణ ఏప్రిల్‌ 24న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 2022 ఆగస్టు 26 వరకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. సీనియారిటీ ప్రకారం జస్టిస్‌ ఎన్వీ రమణను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని జస్టిస్‌ బాబ్డే కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన న్యాయశాఖ.. అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. తాజాగా, దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో నియామకం ఖరారయ్యింది. జస్టిస్ రమణ సుప్రీంకోర్టుకు 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు. గతంలో జస్టిస్ కోకా సుబ్బారావు 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకూ సీజేఐగా పనిచేశారు. జస్టిస్ ఎన్వీ రమణ 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం కావడం విశేషం. 1982లో నల్సార్ న్యాయ విద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేసిన జస్టిస్‌ రమణ 1983 ఫిబ్రవరి 10న బార్‌ అసోసియేషన్‌లో పేరు నమోదు చేసుకున్నారు. అంచలంచెలుగు ఎదుగుతూ హైకోర్టు న్యాయమూర్తిగా అనంతరం.. 2000 జూన్‌ 27న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా విధులు నిర్వహించారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నతస్థాయికి ఎదిగారు. 2017 ఫిబ్ర‌వ‌రి 14 నుంచి సుప్రీంకోర్టు జ‌డ్జిగా ఉన్నారు. అంత‌కు ముందు ఆరు నెల‌ల పాటు ఆయ‌న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ప‌ని చేశారు.


By April 06, 2021 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/justice-nv-ramana-appointed-next-chief-justice-of-india-will-take-charge-on-april-24th/articleshow/81926447.cms

No comments