Breaking News

30 మంది వరకు మావోలు హతం.. బలగాలకు చిక్కకుండా ట్రాక్టర్లలో తరలింపు!


ఏప్రిల్ 2న సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని సౌత్ బస్తర్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్,స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఫ్‌తో కూడిన 2వేల మంది జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో శనివారం తారెమ్ అటవీ ప్రాంతంలో 400 సభ్యులతో కూడిన జవాన్ల బృందంపై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డారు. మోస్ట్ వాంటెడ్ కమాండర్ మడ్వి హిడ్మా నేతృత్వంలో ఈ దాడి జరిగింది. సుమారు 5 గంటల పాటు భీకర కాల్పుల్లో 24 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. మరో 30 మంది గాయపడ్డారు. అయితే, ఈ ఘటనకు నిఘా వైఫల్యమే కారణమనే వాదనలను డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ కొట్టిపారేశారు. ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌లో ఉన్న ఆయన.. బీజాపూర్ ప్రాంతంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మావోయిస్టులపై దాడులకు రచించిన కార్యాచరణలోనూ లోపాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ నిఘా వైఫల్యమే అయితే బలగాలు కూంబింగ్‌కు వెళ్లే పరిస్థితే ఉండదని వ్యాఖ్యానించారు. ఆపరేషన్‌లో వైఫల్యం ఉంటే ఎక్కువ మంది మావోయిస్టులు హతమయ్యేవారు కాదని పేర్కొన్నారు. భద్రతా దళాల కాల్పుల్లో గాయపడినవారి, మృతదేహాలను మావోయిస్టులు మూడు ట్రాక్టర్లలో తరలించినట్లు సమాచారం అందిందని డీజీ తెలిపారు. అయితే, ఈ ఎదురుకాల్పుల్లో ఎంతమంది నక్సలైట్లు మృతిచెందారన్నదానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమన్నారు. సుమారు 25 నుంచి 30 మంది మావోయిస్టులు చనిపోయి ఉంటారని ఆయన అంచనా వేశారు. గాయపడిన జవాన్లను సోమవారం కలవనున్నట్లు ఆయన వెల్లడించారు. నక్సల్స్‌లో పోరాడిన జవాన్లను మంగళవారం కలుసుకుంటానని అన్నారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం చత్తీస్‌గఢ్ చేరుకున్నారు. అమరులైన జవాన్లకు షా నివాళులర్పించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేలా, అధికారులతో సమావేశమై చర్చించనున్నారు. అనంతరం అమిత్‌ షా రాయ్‌పూర్‌లో చికిత్సపొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు.


By April 05, 2021 at 11:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/no-intelligence-failure-nearly-30-maoists-killed-says-crpf-chief/articleshow/81908754.cms

No comments