Breaking News

వరుసగా రెండో రోజు 3 లక్షలకుపైగా కేసులు.. మరో ప్రపంచ రికార్డు భారత్ సొంతం!


దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడంలేదు. రెండో దశలో వైరస్ వ్యాప్తి ప్రమాదకరస్థాయిని దాటుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. వరుసగా రెండో రోజు పాజిటివ్ కేసులు మూడు లక్షలకుపైగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మరే దేశంలోనూ వరుసగా రెండు రోజులు మూడు లక్షల కేసులు నమోదుకాలేదు. దీంతో భారత్ మరో రికార్డును సొంతం చేసుకుంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3.32 లక్షలు కేసులు.. 2,256 మరణాలు రికార్డయ్యాయి. ఇదే విధంగా పాజిటివ్ కేసుల నమోదు కొనసాగితే మూడు రోజుల్లోనే ఒక్క మిలియన్ మార్క్ దాటేయడం ఖాయం. వరుసగా 17 రోజు దేశంలో లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు భారీగా నమోదుకావడంతో ఆరోగ్య వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అలాగే మరణాలు కూడా భారీగానే చోటుచేసుకుంటున్నాయి. వరుసగా నాలుగో రోజు దేశంలో 2వేలకుపైగా నమోదుకావడం గమనార్హం. పది రోజుల నుంచి రోజుకి 1000కిపైగా మరణాలు సంభవిస్తున్నాయి. కేవలం పది రోజుల్లోనే 15 వేల మంది కోవిడ్ మహమ్మారికి బలయ్యారు. మహారాష్ట్రలో వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గురువారం అక్కడ మరో 67,013 కేసులు బయటపడగా.. 568 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో అత్యధికంగా 34,379 కేసులు.. 195 మరణాలు చోటుచేసుకున్నాయి. రాజధాని ఢిల్లీలో 26,169 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్ర తర్వాత అత్యధిక మరణాలు (306) ఢిల్లీలోనే నమోదుకావడం ఆందోళనకర అంశం. కర్ణాటకలో మరో 25,795 కేసులు బయటపడ్డాయి. 25వేలకుపైగా కేసులు నాలుగు రాష్ట్రాల్లో బయటపడ్డాయి. కరోనా విలయానికి చత్తీస్‌గఢ్ చిగురుటాకులా వణుకుతోంది. గురువారం అక్కడ 16,750 కేసులు, 206 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, గుజరాత్, బిహార్, ఆంధ్రప్రదేశ్‌లో 10,000-15,000 మధ్య కేసులు నమోదయ్యాయి. హరియాణా, ఝార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, పంజాబ్‌లలో 5000-10,000 మధ్య పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. చిన్న రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, గోవాలోనూ 1000-5,000లోపు కేసులు బయటపడ్డాయి.


By April 23, 2021 at 06:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-adds-3-lakh-cases-for-second-day-new-record-for-any-country-anywhere-in-the-world/articleshow/82207176.cms

No comments