Breaking News

ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి, 100 మందికి గాయాలు


ఈజిప్ట్‌లో ఘోర చోటుచేసుకుంది. రాజధాని కైరోకు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది వరకు గాయపడ్డారు. కైరోకు 40 కిలోమీటర్ల దూరంలోని బన్హా అనే ఓ చిన్న పట్టణం వద్ద రైలు పట్టాలు తప్పింది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఈజిప్ట్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 60కి పైగా అంబులెన్స్‌లు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది మైనర్లు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. రైలు కైరో నుంచి మన్సోరా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాద దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈజిప్టులో తరుచూ రైలు ప్రమాద ఘటనలు సర్వసాధారణమయ్యాయి. మార్చి 25న రెండు రైళ్లు ఢీకొని 32 మంది మరణించగా, 165 మంది గాయపడ్డారు. అలాగే, గతవారం నైలు నది పరివాహక ప్రాంతంలోని షర్కియా వద్ద రైలు పట్టాలు తప్పిన ఘటనలో 15 మంది గాయపడ్డారు. మార్చి 25న జరిగిన ఘటనకు రైల్వే ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమని దర్యాప్తులో తేలింది. రైల్వే వ్యవస్థ నిర్వహణ లోపాలు, దుర్వినియోగ చరిత్ర ఉంది. విస్తృత పునరుద్ధరణ, ఆధునీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రభుత్వం చెబుతోంది. దేశంలో రైల్వే వ్యవస్థ పునరుద్దరణకు 250 బిలియన్ ఈజిప్టు పౌండ్లు లేదా 14.1 బిలియన్ డాలర్లు అవసరమని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫట్టా ఎల్-సిస్సీ 2018లో ప్రకటించారు. ఏటా ఈజిప్టులో వందలాది రైలు ప్రమాదలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2019లో కైరో రైల్వే స్టేషన్‌లోకి హఠాత్తుగా లోకోపైలట్ లేకుండానే ఓ రైలు ఇంజిన్ దూసుకొచ్చింది. దీంతో భారీ పేలుడు సంభవించి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు బాధ్యతవహిస్తూ ఈజిప్టు రవాణా మంత్రి తన పదవికి రాజీనామా చేశారు.


By April 19, 2021 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/at-least-11-killed-about-100-injured-in-train-crash-north-of-cairo-in-egypt/articleshow/82137089.cms

No comments