Breaking News

దేశ్‌ముఖ్ 100 కోట్ల టార్గెట్ నిజమే.. మరో మంత్రిపై కూడా బాంబు పేల్చిన వాజే!


మహారాష్ట్ర మాజీ హోం మంత్రిపై పోలీస్ అధికారి పరమ్‌బీర్ సింగ్‌ చేసిన అవినీతి ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. అంబానీ బెదిరింపుల కేసులో అరెస్టయిన పోలీస్ అధికారి ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. బుధవారం ఉదయం ఎన్ఐఏ ఎదుట విచారణకు హాజరైన వాజే.. బార్లు, పబ్బుల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్‌ దేశ్‌ముఖ్‌ టార్గెట్ ఇచ్చిన మాట నిజమేనని అంగీకరించారు. అంతేకాదు, మరో మంత్రిపై కూడా ఆయన బాంబు పేల్చారు. ఓ సంస్థ నుంచి రూ.50 కోట్లు వసూలు చేయాలని రవాణా శాఖ మంత్రి, శివసేన నేత అనిల్‌ పరబ్‌ తనకు పురమాయించారని తెలిపారు. అయితే, ఈ పనులు తన వల్ల కావని ఆ ఇద్దరికీ తేల్చిచెప్పానని పేర్కొన్నారు. ఈ వ్యవహారం గురించి అప్పట్లోనే ముంబై పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న పరంబీర్‌ సింగ్‌కు చెప్పానని, ఆ పనికి అసలు పూనుకోవొద్దని ఆయన తనకు చెప్పారని వెల్లడించారు. గతేడాది అక్టోబరులో సహ్యాద్రి గెస్ట్‌హౌ‌స్‌కు పిలిపించిన అనిల్‌ దేశ్‌ముఖ్‌.. ముంబైలో ఉన్న 1,650 బార్లు, రెస్టారెంట్ల నుంచి డబ్బు వసూలు చేయాలని నిర్దేశించారని వాజే వెల్లడించారు. ఈ పనిని తాను చేయలేనని అప్పట్లో చెప్పినా, ఈ ఏడాది జనవరిలో మళ్లీ దేశ్‌ముఖ్‌ నుంచి తనకు పిలుపొచ్చిందని చెప్పారు. ఈసారి నేరుగా దేశ్‌ముఖ్‌ అధికార నివాసం ‘ధ్యానేశ్వరి’లోనే సమావేశం జరిగిందని, ఆ సమయంలో అక్కడ మంత్రితో పాటు ఆయన పీఏ కుందన్‌ కూడా ఉన్నారని వాజే తెలిపారు. ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.3-3.5 లక్షల చొప్పున వసూలు చేయాలని ఆదేశించారని వాజే వెల్లడించారు. అంతేకాదు, గతేడాది నవంబరులో అజిత్ పవార్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి తనను సంప్రదించారని అన్నారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న అక్రమ పొగాకు, గూట్కా వ్యాపారం గురించి చెప్పి, వారి నుంచి నెలకు రూ.100 కోట్ల ఎలా వసూలు చేయాలో వివరించాడని అన్నారు. ఇక విచారణను ఎదుర్కొంటున్న సైఫీ బుర్హానీ అప్‌లిఫ్టమెంట్‌ ట్రస్ట్‌ (ఎస్బీయూటీ) నుంచి రూ.50 కోట్లు వసూలు చేయాలని మరో మంత్రి అనిల్‌ పరబ్‌ ఆదేశించారని వాజే ఆరోపించారు. గతేడాది జూలై-ఆగస్టు మధ్య తననను అధికారిక బంగ్లాకు పిలిపించుకుని ఈ మొత్తాన్ని ఎలా వసూలు చేయాలో వివరించారని పేర్కొన్నారు. అలాగే, ఈ ఏడాది జనవరిలో మరోసారి పిలిపించిన ఆయన.. బీఎంసీలో మోసానికి పాల్పడిన కాంట్రాక్టర్ల జాబితా ఇచ్చి, వారిపై విచారణ చేయాలన్నారని తెలిపారు. అటువంటి 50 మంది కాంట్రాక్టర్ల నుంచి కనీసం రూ.2 కోట్లు వసూలు చేయాలని సూచించారని వివరించారు. ఈ విషయంలోనూ తాను అభ్యంతరం వ్యక్తం చేశానని, ట్రస్ట్‌ మీద కొనసాగుతున్న విచారణ, ట్రస్టీల్లో ఎవరూ తనకు తెలియదని పరబ్‌కు స్పష్టం చేశానని వాజే వెల్లడించారు. అలాగే, మహారాష్ట్ర పోలీసు శాఖలో గతేడాది తన పునఃనియామకాన్ని ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ తీవ్రంగా వ్యతిరేకించారని వాజే పేర్కొన్నారు. అయితే తాను రాష్ట్ర పోలీసు శాఖలోనే పనిచేసేవిధంగా పవార్‌ను ఒప్పించే బాధ్యతను తీసుకుంటానని మాటిచ్చిన అనిల్‌ దేశ్‌ముఖ్‌ ,ఆ పని జరగాలంటే రూ.2కోట్లు ఇవ్వాలన్నారని మరో బాంబు పేల్చారు. అయితే, వాజే లేఖను మాత్రం న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన తరఫున లాయర్ రౌనాక్ నాయక్ అన్నారు. తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించిందని పేర్కొన్నారు. అటు, ఈ లేఖపై స్పందించడానికి ఎన్‌సీపీ నిరాకరించింది. అంతేకాదు, అజిత్ పవార్‌ గురించి నేరుగా ఎటువంటి ఆరోపణలు చేయలేదని వ్యాఖ్యానించింది.


By April 08, 2021 at 07:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ambani-security-scare-sachin-waze-claims-two-ministers-asked-him-to-extort-big-time/articleshow/81961355.cms

No comments