Breaking News

‘రఫేల్’‌లో భారత మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్.. ఫ్రాన్స్ మీడియా సంచలన కథనం!


ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక యుద్ధ విమానాలు రఫేల్ ఒప్పందంపై మరోసారి దుమారం రేగుతోంది. ఒప్పందం సమయంలో భారత్‌లోని ఓ మధ్యవర్తికి 1.1 మిలియన్ యూరోలు కమిషన్‌ కింద డసాల్ట్ ఏవియేషన్ సంస్థ చెల్లించినట్టు ఫ్రెంచ్ మీడియా కథనం ప్రచురించింది. దీంతో రఫేల్ వ్యవహారంలో కుంభకోణానికి పాల్పడ్డారని కేంద్రంపై గతంలో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌కు మరో అవకాశం లభించింది. రఫేల్‌ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్‌ ఏవియేషన్‌ భారత్‌లోని ఓ మధ్యవర్తికి దాదాపు 1.1 మిలియన్‌ యూరోలు (దాదాపు పది కోట్లు) కమీషన్‌గా ఇచ్చినట్లు ఏప్రిల్‌ 4న ఫ్రాన్స్ మీడియా ‘మీడియా పార్ట్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్‌ అవినీతి నిరోధక సంస్థ (ఏఎఫ్‌ఏ) ఆడిటింగ్‌లో ఈ విషయాలు వెల్లడయినట్టు అందులో పేర్కొంది. అగస్టా వెస్ట్‌లండ్ హెలికాప్టర్ల ఒప్పందంలో మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ గుప్తా పేరును ప్రస్తావించి, ఆయనే మధ్యవర్తి అని తెలిపింది. అయితే రఫేల్‌ నమూనాల తయారీకే ఆ మొత్తాన్ని వినియోగించినట్లు డసాల్ట్‌ వివరణ ఇచ్చిందని మీడియా పార్ట్ తెలియజేసింది. అయితే, ఈ నమూనాలను తయారుచేసిన ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఖాతాదారులకు గిఫ్ట్‌లు కింద 2017లో 508,925 యూరోల ఖర్చుచేసినట్టు గుర్తించిన ఏఎఫ్ఏ ఆడిటింగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారని వివరించింది. బహుమతి ఖర్చుల కింద రాసిన మొత్తం భారీగానే ఉంది.. ఫ్రెంచ్ చట్టం ఖచ్చితమైన పరిమితులను నిర్దేశించనప్పటికీ, ఖరీదైన గడియారం లేదా అనేక వందల యూరోలతో ఖరీదైన డిన్నర్ ఇవ్వడం అవినీతి కిందకు వస్తుందని అక్కడ రాజ్యాంగ సూత్రాలు సూచిస్తున్నాయి. ‘ఇది సాధారణ బహుమతి కంటే పెద్దది’ అని నివేదిక పేర్కొంది. 2017 మార్చి 30 న పంపిన ఇన్వాయిస్‌లో డెఫిసెస్ సొల్యూషన్స్ అనే భారతీయ సంస్థకు సరఫరా చేసినట్టు, మొత్తం 50 నమూనాలు ఒక్కోదానికి 20,357 యూరోలు చెల్లించినట్టు నివేదిక తెలిపింది. డెఫిసెస్ సొల్యూషన్ సంస్థ అగస్టా‌వెస్ట్ లాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ గుప్తాని కావడం గమనార్హం. ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు రఫేల్‌ యుద్ధ విమానాలు చేరుకుంటున్న సమయంలోనే ఈ వార్తలు రావడం దేశ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపుతోంది. ముందు నుంచీ తాము వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనని రుజువయ్యాయని కాంగ్రెస్ పేర్కొంది. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు, పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని, ఒప్పందంపై తమ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తోన్న ఆరోపణలు సరైనవేనని తాజా ఫ్రెంచ్‌ మీడియా కథనం ద్వారా తెలుస్తోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో డసాల్ట్‌ ఏవియేషన్‌ భారత్‌కు చెందిన మధ్యవర్తికి 1.1 మిలియన్‌ యూరోలు ‘కమీషన్‌’గా ఇచ్చినట్లు ఫ్రాన్స్ అవినీతి నిరోధక సంస్థ ఆడిటింగ్‌లో తేలడమే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని ‘వినియోగదారులకు బహుమతులు’గా డసాల్ట్‌ ఏవియేషన్‌ చూపించడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు.


By April 06, 2021 at 12:46PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dassault-paid-1-million-euros-to-indian-middleman-in-rafale-deal-says-french-report/articleshow/81928140.cms

No comments