Breaking News

హెలికాప్టర్ ప్రమాదంలో రాఫేల్ తయారీ సంస్థ యజమాని దుర్మరణం


ఫ్రెంచ్‌ బిలియనీర్‌, రాఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ అధినేత ఒలీవర్‌ డస్సాల్ట్‌ ‌(69) హెల్‌కాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు. వాయువ్య ఫ్రాన్స్‌లోని నార్మండి ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఒలీవర్‌తో పాటు పైలెట్‌ కూడా దుర్మరణం చెందాడు. ఒలీవర్‌ మరణం పట్ల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మెక్రాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌ను ఎంతగానో ప్రేమించే ఆయన మృతి దేశానికి తీరని లోటని ఆవేదన చెందారు. ‘ ఫ్రాన్స్‌ను ఎంతగానో ప్రేమించారు.. పరిశ్రమకు ఆయనో కెప్టెన్, రాజకీయనేత, ఎయిర్‌ఫోర్స్‌లో రిజర్వ్ కమాండర్.. ఆయన జీవిత పర్యంతం దేశ సేవను ఎన్నడూ విడిచిపెట్టలేదు.. ఆ గౌరవమే ఆయనకు గొప్ప ఆస్తి.. ఆయన ఆకస్మిక మరణం దేశానికి తీరని లోటు’ అని మెక్రాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఒలీవర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో పైలెట్‌తో పాటు ఒలీవర్‌ ఒక్కరే ఉన్నారు. డస్సాల్ట్‌ ఏవియేషన్‌ సంస్థ యజమాని అయిన ఓలివర్‌.. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగానూ ఉన్నారు. డస్సౌల్ట్‌ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. భారత్‌కు రఫేల్‌ యుద్ధవిమానాలను ఆ సంస్థే తయారు చేస్తోంది. ఒలీవర్ డస్సాల్ట్ 2002లో ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభకు ఎన్నికయ్యారు. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం.. ప్రపంచంలోని బిలీనియర్ల జాబితాలో 361వ స్థానంలో ఉన్న ఒలీవర్ సంపద 6.3 బిలియన్ యూరోలు. డియువిల్లే వద్ద ఓ ప్రయివేట్ ల్యాండ్ నుంచి టేకాఫ్ అయిన ఒలీవర్ డస్సాల్ట్ ప్రయాణించిన ఏఎస్350 ఎక్యూరైల్ హెలికాప్టర్ కొద్దిసేపటి తర్వాత ప్రమాదానికి గురయినట్టు ఫ్రాన్స్ పౌర విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. డస్సాల్ట్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థను ఒలీవర్ తాన మార్సెల్ డస్సాల్డ్ స్థాపించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ యుద్ధ విమానాలనే ఫ్రాన్స్ వినియోగించింది.


By March 08, 2021 at 06:58AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/french-billionaire-olivier-dassault-dies-in-helicopter-crash/articleshow/81384468.cms

No comments