Breaking News

కరోనా కమ్మేసినా ఆ దేశంలో ఆనందం తగ్గలేదు.. మరి భారత్ స్థానం ఎక్కడ?


కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ తరగని ఆనందాన్ని సొంతం చేసుకుని ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్‌లాండ్ నిలిచింది. వరుసగా ఆ దేశంలో నాలుగో ఏడాదీ అగ్రస్థానంలో నిలవడం విశేషం. మార్చి 20న అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ప్రపంచ ఆనంద నివేదిక-2021’ను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ మాత్రం అట్టుడుగునే నిలిచింది. మొత్తం 149 దేశాలతో కూడిన జాబితాలో 139వ స్థానంతో సరిపెట్టుకుంది. గత తొమ్మిదేళ్లుగా ఐరాస ఏటా ఈ నివేదికను విడుదల చేస్తోంది. ఈ ఏడాది జాబితాలో ఫిన్‌లాండ్ ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్‌, స్విట్జర్లాండ్‌, ఐస్‌లాండ్, నెదర్లాండ్స్‌లు నిలిచాయి. టాప్-10లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఒక్క న్యూజిలాండ్ తప్పా మిగతావన్నీ ఐరోపా దేశాలే కావడం మరో విశేషం. గతేడాది 18వ స్థానంలో ఉన్న అమెరికా ఈసారి 19వ స్థానానికి పడిపోయింది. ఐరాస ‘సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌’ఈ నివేదికను ఏటా వెల్లడిస్తూ వస్తోంది. మొత్తం 149 దేశాలను పరిగణనలోకి తీసుకున్నా... మహమ్మారి కారణంగా 100 దేశాల్లోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. మిగతా దేశాల్లో ఇదివరకే చేపట్టిన ‘గాలప్‌ వరల్డ్‌ పోల్‌’ డేటాను ఆధారం చేసుకుని ర్యాంకులను కేటాయించింది. ఆయా దేశాల్లో జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయిలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ఇచ్చారు. ‘గతేడాది డేటా, అంతకు ముందు సంవత్సరాల సగటుతో పోల్చిచూడగా.. మూడో వంతు దేశాల్లో కోవిడ్-19 మహమ్మారి, ప్రతికూల భావోద్వేగాల ప్రభావం అధికంగా ఉన్నట్టు తేలింది. కానీ 22 దేశాలలో సానుకూల భావోద్వేగాలు పెరిగాయి.. వారి జీవితాలను స్వీయ మూల్యాంకనం చేసుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా సగటున శ్రేయస్సు తగ్గలేదు’ అని నివేదికలో పాలుపంచుకున్న జాన్ హెల్లివెల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2019 నివేదిలో మూడో ర్యాంకు సంపాదించిన నార్వే... ఇప్పుడు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. బ్రిటన్‌ 13 నుంచి 17కు పడిపోగా.. జర్మనీ నాలుగు ర్యాంకులు ముందుకొచ్చి 13వ స్థానంలో నిలిచింది. అత్యంత సంతోష దేశాల జాబితాలోని టాప్ 20లో చైనాకు చోటు దక్కింది. గత ఏడాది 94వ స్థానంలో ఉన్న డ్రాగన్‌ ఈసారి 19వ స్థానంలోకి దూసుకొచ్చింది. సంతోషంలో అట్టడుగున ఉన్న దేశాలను కూడా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. కింది నుంచి అఫ్గానిస్థాన్‌ తొలి స్థానంలో నిలవగా.. ఆఫ్రికా దేశాలపై జింబాబ్వే, టాంజానియా, జోర్డాన్‌లలో నిరుడు అల్ప సంతోషమే మిగిలిందని వ్యాఖ్యానించింది.


By March 20, 2021 at 07:47AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/finland-has-been-named-happiest-in-the-world-despite-covid-pandemic/articleshow/81598299.cms

No comments