Breaking News

మావోలకు ఎదురుదెబ్బ.. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు హతం


మహరాష్ట్ర అడవులు మరోసారి తుపాకుల మోతతో దద్దరిళ్లాయి. గడ్చిరోలి జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోలు హతమయ్యారు. ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సమయంలో భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమయిన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించిన అధికారులు కూంబీంగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తప్పించుకున్న మావోలు కోసం ముమ్మరంగా గాలింపు జరుగుతోందని.. నక్సల్స్‌ను మొత్తం ఏరివేసేవరకు ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మృతి చెందగా.. మరికొందరు మావోయిస్టులు తీవ్రగాయపడ్డారని గడ్చిరోలి డీఐసీ సందీప్ పాటిల్ వెల్లడించారు. శనివారం నుంచి మావోయిస్ట్‌లు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్టు పాటిల్ తెలిపారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యం లభ్యమైనట్టు పేర్కొన్నారు. చమకమ్ కోబ్రమెండ అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులున్నట్టు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్‌కు సమాచారం అందింది. మావోయిస్ట్ వారోత్సవాల సందర్భంగా భారీ విధ్వంసానికి నక్సల్స్ వ్యూహరచన చేసినట్టు నిఘా వర్గాల ద్వారా తెలియడంతో ఏఎస్పీ మనీశ్ కల్వానియా నేతృత్వంలో పోలీసులు అక్కడ చేరుకున్నాయి. యాంటీ-నక్సల్ ఆపరేషన్ కొనసాగుతుండగా మొత్తం మూడు ప్రాంతాల్లో 60 నుంచి 70 మంది మావోయిస్టులు నక్కినట్టు గుర్తించారు. ఈ సమయంలోనే పోలీసులపై కాల్పులు ప్రారంభించడంతో తక్షణమే అప్రమత్తమై ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య దాదాపు 60 నుంచి 70 నిమిషాల పాటు ఎన్‌కౌంటర్ కొనసాగింది.


By March 29, 2021 at 12:57PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-maoists-killed-in-khobramendha-forest-encounter-in-gadchiroli/articleshow/81744136.cms

No comments