Breaking News

హోంమంత్రి వ్యవహారంపై రిటైర్డ్ జడ్జ్‌తో విచారణ.. సీఎం ఉద్ధవ్ ఆదేశం


హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలతో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. మహావికాస్ అఘాడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ ముప్పేటి దాడిచేస్తోంది. ఈ నేపథ్యంలో అనిల్ దేశ్‌ముఖ్‌‌ విషయంలో పోలీస్ అధికారి చేసిన ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా హోంమంత్రి ఆదివారం వెల్లడించారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ విషయంలో చేసిన ఆరోణలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించడానికి సీఎం ఉద్ధవ్ సిద్ధమయ్యారు. అవినీతి ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని తానే స్వయంగా సీఎం ఉద్ధవ్‌ను కోరినట్లు అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. ఈ విచారణతో నిజానిజాలు బయటికి వస్తాయని ఆయన ఉద్ఘాటించారు. మాజీ పోలీస్ కమిషనర్ తనపై చేసిన ఆరోపణలను హోం మంత్రి తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నెలకు రూ.100 కోట్లు వసూలుచేయడమే లక్ష్యమని ముంబై మాజీ పోలీస్ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ బాధ్యతలను సచిన్ వాజేకు అప్పగించారని ఆరోపించారు. వీటిని తోసిపుచ్చిన అనిల్ దేశ్‌ముఖ్.. ఫిబ్రవరి 5న నాకు కరోనా పాజిటివ్ రావడంతో నాగ్‌పూర్‌లోని ఆస్పత్రిలో 15 వరకు ఉన్నానని, ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ఫిబ్రవరి 27 వరకు హోంక్వారంటైన్‌లోనే గడిపానని అన్నారు. పరంబీర్ సింగ్ చెప్పినట్టు ఆ మధ్యకాలంలో తాను ఎవరినీ కలవలేదన్నారు. పరంబీర్ సింగ్ ఆరోపణలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తుది నిర్ణయం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు వదిలిపెట్టారు. ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్ధాలతో కూడిన వాహనం కేసులో దర్యాప్తు జరుగుతుండగా.. ముంబయి పోలీస్ కమిషనర్ బాధ్యతల నుంచి పరంబీర్ సింగ్‌ను తప్పించడంతో వ్యవహారం మలుపు తిరిగింది.


By March 28, 2021 at 03:35PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharashtra-home-minister-anil-deshmukh-says-retired-judge-to-probe-claim/articleshow/81734986.cms

No comments