Breaking News

అగ్రరాజ్యంలో ఏషియన్ అమెరికన్లపై ద్వేషభావం.. సత్య నాదేళ్ల సంచలన వ్యాఖ్యలు


అమెరికన్‌ సమాజంలో ఆసియా సంతతి పట్ల ద్వేషభావం, హింస ఏటా పెరుగుతూవస్తోంది. గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు 3వేల మంది ఆసియన్ అమెరికన్లపై దాడులు జరగడమే ఇందుకు నిదర్శనం. ఈ ద్వేషభావం పట్ల మైక్రోసాఫ్ట్‌ సీఈవో , పలువురు అమెరికా ప్రజా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. జాతి వివక్ష, హింస ఏ రూపంలో ఉన్నా తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తొమ్మిది నెలల్లో ఏషియన్‌ అమెరికన్లను ద్వేషించినట్టు మూడు వేలకుపైగా కేసులు నమోదయ్యాయని బాధిత వర్గానికి చెందిన న్యాయవాద బృందం నివేదిక వెల్లడించింది. ఎఫ్‌బీఐ గణాంకాల ప్రకారం.. 2019లో మొత్తం ఇటువంటివి 216 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ‘ఆసియా సంతతిపై అమెరికా సహా ఇతర ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ద్వేషభావం చూసి నేను ఆందోళన చెందుతున్నా. మన సమాజంలో ఇటువంటి వివక్షకు చోటు లేదు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఆసియా, ఆసియా సంతతి అమెరికన్లకు సంఘీభావం తెలుపుతున్నా’ అని సత్య నాదెళ్ల ట్వీట్‌ చేశారు. ఆసియా సంతతి అమెరికన్లపై ద్వేషం చూపడం దుర్మార్గమని, కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో అమెరికా మౌలిక సూత్రాలకు విరుద్ధమైన ఈ వైఖరి విడనాడాలంటూ అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చిన మర్నాడే సత్య నాదెళ్ల ఈ ప్రకటన చేశారు. అమెరికా చట్టసభలకు చెందిన పలువురు ప్రతినిధులు సైతం వర్ణ వివక్ష, ద్వేషభావం తగదంటూ ప్రకటనలు చేశారు. ఆసియన్ అమెరికన్లు, పసిఫిక్ దీవుల కమ్యూనిటీలపై కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన సమయంలో హింసకు పాల్పడటం శోచనీయమని వ్యాఖ్యానించారు. ఆసియన్ అమెరికన్లపై వర్ణవిక్ష దాడులు పెరుగుతుండటం ఆందోళనకర అంశమని కాంగ్రెస్ సభ్యుడు డొనాల్డ్ ఎం పెయినీ వ్యాఖ్యానించారు. ‘అమెరికా సమాజంలో హింస, విద్వేషానికి తావులేదు.. ఇటువంటి దాడులు ఆగిపోవాలి ఎందుకంటే అవి వేలాది మైళ్ల దూరంలో ప్రారంభమైన మహమ్మారికి అమెరికన్లను బలిపశువులు, నిందించడానికి చేస్తున్న పిరికి పందల ప్రయత్నాలు’అని వ్యాఖ్యానించారు.


By March 14, 2021 at 12:47PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/microsoft-ceo-satya-nadella-us-lawmakers-on-acts-of-hate-against-asian-americans/articleshow/81493120.cms

No comments