Breaking News

మిగతా జీవితం ప్రజాసేవ కోసమే.. ఇది సినిమా డైలాగ్ కాదు: కమల్ వ్యాఖ్యలు


తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేలకు భిన్నంగా కమల హాసన్ నాయకత్వంలోని కూటమి శుక్రవారం విడుదల చేసిన మేనిఫేస్టోలో హామీలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. అవినీతి రహిత పాలనతో ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతామని కమల్ ప్రకటించారు. మహిళలకు నైపుణ్యాలను పెంచడం ద్వారా ఆదాయం పెంపునకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారికి ప్రభుత్వ ఖజానా నుంచి ఉచితంగా చెల్లింపులు సరికాదని ఆయన స్పష్టం చేశారు. దీనినే గృహిణులకు నెలవారీ భత్యంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తిరుప్పూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కమల్ మాట్లాడుతూ.. తన మిగిలిన జీవితం ప్రజల కోసమేనని, ఇది సినిమా డైలాగ్ కాదని వ్యాఖ్యానించారు. తమ అభ్యర్థులు రాజకీయ మార్పునకు చిహ్నాలని అన్నారు. అధికారంలోకి వచ్చినా ఎన్నికల్లో తాము గెలిచినట్టు కాదని, ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే నిజమైన విజేతలమని వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు గురిచేసే ఎన్నికల హామీలను తాము ఇవ్వలేమని ఎంఎన్ఎం అధినేత తెలిపారు. తాను పార్టీని ప్రారంభించినప్పుడు ఎక్కువ రోజులు కొనసాగదని విమర్శించారని అన్నారు. మంచి భవిష్యత్‌ కోసం ప్రజలు పెద్దసంఖ్యలో తన ప్రచారానికి హాజరవుతున్నారని కమల్ తెలిపారు. ఉచితాలు ఎవరికి కావాలి? ఉపాధి కల్పిస్తే యజమానిగా మారుతారని, ఉచితాలు ఇచ్చి ప్రజలను మరింత పేదలుగా మార్చొద్దని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే శాంతిభద్రతల పరిరక్షణ ఉచితమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, ఆస్పత్రుల్లో వైద్యం ప్రపంచస్థాయిలో అందజేస్తామని స్పష్టం చేశారు. ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చినా తన మిగిలిన జీవితం ప్రజాసేవకే అంకితమని ఉద్ఘాటించారు. తాను వారసత్వంగా రాజకీయాల్లోకి రాలేదని, తాను మాత్రమే వచ్చానని తెలిపారు. తన తర్వాత వారసులు పార్టీ తరఫున వచ్చే నేతలు ఈ జన సమూహంలో కూడా ఉండొచ్చన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, గ్యాస్‌ ధరల తగ్గింపు తదితర విషయాల్లో కేంద్ర ప్రభుత్వంపై కమల్‌ విమర్శలు గుప్పించారు.


By March 20, 2021 at 09:40AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/tamil-nadu/news/mnm-president-kamal-haasan-says-my-remaining-life-will-sacrifice-to-public-service/articleshow/81599253.cms

No comments