Breaking News

లాక్‌డౌన్‌‌కు నేటితో ఏడాది పూర్తి.. దేశంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?


దేశంలో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ప్రారంభమై గురువారం (మార్చి 25) నాటికి ఏడాది పూర్తయ్యింది. గతేడాది తొలినాళ్లలో పాజిటివ్ కేసులు మెల్లమెల్లగా పెరుగుతుండటంతో ప్రజలకు అవగాహన కల్పించడానికి, కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు సంఘీభావం తెలపడానికి మార్చి 22న ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ ప్రకటించారు. దానికి కొనసాగింపుగా తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు మార్చి 23 నుంచి 31 వరకు విధించాయి. జనతా కర్ఫ్యూ తర్వాత.. దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అదే రోజు రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. లాక్‌డౌన్ ప్రారంభమయ్యే రోజుకి దేశంలో 569 కేసులు ఉండగా.. 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తొలి దశ లాక్‌డౌన్ మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు 23 రోజుల పాటు ఉండగా అది ముగిసిన వెంటనే కొనసాగింపుగా ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు రెండో విడత లాక్‌డౌన్ మొదలయ్యింది. మూడో విడత మే 4 నుంచి 17, నాలుగో విడత మే 18 నుంచి 31 వరకు లాక్‌డౌన్ కొనసాగించారు. ఆ తరువాత జూన్ 1 నుంచి క్రమంగా సడలింపులు ఇస్తూ అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఆ తరువాత పాజిటివ్ కేసులు పెరిగినా క్రమంగా తగ్గి జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు వర్ణానాతీతం. పనిలేక, పరాయి ఊర్లో పస్తులుండలేక వందల కిలోమీటర్ల దూరంలోని స్వస్థలాలకు కాలినడక వలస కార్మికులు పయమమైన వెళ్లిన తీరు యావత్తు ప్రపంచాన్ని కంటతడి పెట్టించింది. ప్రజా రవాణా నిలిచిపోవడంతో నెత్తిన బ్యాగులు, చంకలో చంటి బిడ్డలతో సుదూరంలోని స్వగ్రామాలకు తిరుగుపయనమయ్యారు. ఈ సమయంలో వలస జీవులు కష్టాలకు చలించిపోయి ఎందరో మానవతావాదులు తమకు తోచిన సాయం చేశారు. కొందరు సొంతూళ్లకు వెళ్లే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. ఆత్మగౌరవ పోరాటంలో వలస జీవులకు పలువురు ఆపన్నహస్తాలను అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేసిన సాయానికి యావత్తు భారతావని గర్వించింది. తన సొంత ఖర్చులతో బస్సులు, విమాన టిక్కెట్లు ఏర్పాటుచేసి వేలాది మందిని సోనూ స్వస్థలాలకు పంపారు. అయితే, కొద్దిరోజులుగా మళ్లీ దేశంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలు ప్రారంభించాయి. అందులో భాగంగానే కొన్ని నగరాల్లో ఆంక్షలు అమలు చేయడంతో పాటు లాక్‌డౌన్‌లూ విధిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించగా.. మధ్యప్రదేశ్‌లోని ఏడు నగరాల్లో ఆదివారం లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో తాజాగా నాందేడ్, బీడ్ జిల్లాల్లో ఏప్రిల్ 4 వరకు లాక్‌డౌన్ విధిస్తూ ఉద్ధవ్ ఠాక్రే సర్కారు బుధవారం ప్రకటన చేసింది. అయితే, ఈ సమయంలో అత్యవసర సర్వీసులన్నీ కొనసాగేలా నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలు 25 శాతం సిబ్బందితో పనిచేయాలని ఆదేశించారు. టీకా అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. జులై చివరి నాటికి దేశంలో 30 కోట్ల మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం 60 ఏళ్లు దాటినవారు, 45 ఏళ్లు దాటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక, ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన అందరికీ టీకా వేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా... ఇప్పటి వరకూ 5.21 కోట్ల మందికి టీకా అందజేశారు. గతేడాది సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు క్రమంగా తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం అత్యధికంగా 53,687 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. ఐదు నెలల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరగడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1.17 కోట్ల మంది వైరస్ బారినపడగా.. వీరిలో 1.12 కోట్ల మంది కోలుకున్నారు. మరో 1.61 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం దాదాపు నాలుగు లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదయిన దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. కోవిడ్ మరణాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. అగ్రరాజ్యం అమెరికాలో 558,422 మంది ప్రాణాలు కోల్పోగా, బ్రెజిల్‌లో 301,687 మంది చనిపోయారు. మరోవైపు, దేశంలో కొత్త ‘డబుల్ మ్యుటేషన్ స్ట్రెయిన్’ను గుర్తించినట్లు కేంద్రం పేర్కొంది. దీంతో పాటు 771 కరోనా వేరియంట్ కేసులను గుర్తించినట్లు ప్రకటించింది. వీటిలో 736 యూకే రకానికి చెందిన వైరస్ కేసులు, 34 సౌతాఫ్రికా రకానికి చెందిన కేసులు, ఒకటి బ్రెజిల్ రకానికి చెందిన వైరస్ ఉన్నట్లు వెల్లడించింది. దేశంలో 18 రాష్ట్రాల్లో కొత్త రకం స్ట్రెయిన్లను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం (మార్చి 24) తెలిపింది.


By March 25, 2021 at 09:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/one-year-for-india-went-into-nationwide-lockdown-to-tackle-coronavirus/articleshow/81681907.cms

No comments