Breaking News

దేశంలో సెకెండ్ వేవ్.. ఏప్రిల్ మధ్య నాటికి పీక్ స్టేజ్‌కి: ఎస్బీఐ సంచలన నివేదిక


దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి పెరుగుతుండటంతో మహమ్మారి రెండో దశ (సెకెండ్ వేవ్) మొదలైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి పాజిటివ్ కేసుల్లో క్రమంగా పెరుగుదల మహమ్మారి విరుచుకుపడుతుందనడానికి సంకేతమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అధ్యయనం స్పష్టం చేసింది. ఈ సెకండ్‌ వేవ్‌ 100 రోజులు ఉండే అవకాశం ఉందని, ఏప్రిల్‌ 15 నాటికి కేసులు గరిష్ఠ స్థాయికి చేరుతాయని అంచనా వేసింది. అంతేకాదు, ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ దశలో 25 లక్షల మందికిపైగా కరోనా బారిన పడే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది. మే నెలాఖరు వరకూ రెండో దశ కొనసాగుతుందని పేర్కొంది. ఎస్బీఐ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్ ఆధ్వర్యంలో ‘సెకెండ్ వేవ్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్: ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్’ పేరుతో నివేదికను రూపొందించారు. ఆంక్షలు, లాక్‌డౌన్‌ల వల్ల ఉపయోగం ఉండదని, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ద్వారా కరోనాను నిలువరించవచ్చని నివేదిక సూచించింది. ‘కోవిడ్ రెండో దశ విజృంభణ మొదటి దశ కంటే తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అనుభవాలు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం టీకా రావడం వల్ల కొంత వ్యత్యాసం ఉంటుంది.. తద్వారా భారత్‌ పరిస్థితిని చక్కగా నిర్వహించగలుగుతుంది’ అని వ్యాఖ్యానించింది. వారం రోజులుగా బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ పతన దిశలో ఉందని, కొన్ని రాష్ట్రాల్లో విధించిన ఆంక్షలు, లాక్‌డౌన్‌ల ప్రభావం వచ్చే నెలలో స్పష్టంగా కనిపిస్తుందని నివేదిక వివరించింది. ‘గత ఏడాది ఇదే సమయానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు కేసుల సంఖ్య 500లోపే. అయితే, లాక్‌డౌన్లను పొడిగించుకుంటూ పోయిన కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది’అని ఆయన పేర్కొన్నారు. ‘1918–19లో సంభవించిన స్పానిష్‌ ఫ్లూ సమయంలో కూడా ఆయా దేశాల్లో లాక్‌డౌన్‌లు విధించి స్కూళ్లు, ప్రార్థనా మందిరాలు, థియేటర్లను మూసివేశారు. కానీ, లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేశాక పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది’ అని విశ్లేషించారు ప్రస్తుతం రోజూ 34 లక్షల టీకాలు వేస్తున్నారని, దీన్ని 40-45 లక్షలకు తీసుకు రావాలని, అప్పుడు ఏప్రిల్ 1 నుంచి అనుకున్నట్టు 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయాలంటే 4 నెలలు పడుతుందని అభిప్రాయపడింది. ప్రతి 100 మందికి టీకాలు వేసే వేగాన్ని గణనీయంగా పెంచాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 5.3 కోట్ల మందికి టీకాలు వేశారు. టాప్‌-15 జిల్లాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, అవి కూడా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. గ్రామీణ జిల్లాల్లో పరిస్థితి దాదాపు స్థిరంగా ఉంది. రాజస్థాన్‌, గుజరాత్‌, కేరళ, ఉత్తరాఖండ్‌, హరియాణా రాష్ట్రాల్లోని జనాభాలోని 20 శాతానికిపైగా వృద్ధులకు (60 ఏళ్లు పైబడి) టీకాలు వేశారు. 60 ఏళ్లకుపైబడిన వృద్ధులు ఎక్కువగా ఉన్న పంజాబ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్‌ వంటి రాష్ట్రాలు తక్కువ శాతం మందికే టీకాలు ఇచ్చాయని, ఆ రాష్ట్రాల్లో టీకాల వేగాన్ని పెంచాలని పేర్కొంది. బుధవారం నాటికి దేశంలోని 2.32 కోట్ల మంది వృద్ధుల టీకా అందజేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే 45- 60 ఏళ్లలోపు వ్యక్తుల్లో దాదాపు 51.31 లక్షల మందికి ఇప్పటి వరకూ వ్యాక్సిన్ ఇచ్చారు. దేశీయ అవసరాలకు వినియోగిస్తూనే విదేశాలకు కూడా భారత్ టీకాలను సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకూ 80 దేశాలకు 6.4 కోట్ల డోస్‌లను అందజేసింది.


By March 26, 2021 at 07:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/second-wave-of-covid-may-last-up-to-100-days-counted-from-february-15-sbi-report/articleshow/81698942.cms

No comments