Breaking News

ఢిల్లీ: టీకా రెండు డోస్‌లు తీసుకున్న డాక్టర్, నర్సుకు కోవిడ్ పాజిటివ్!


కోవిడ్ టీకా రెండు డోస్‌లు తీసుకున్న తర్వాత ఓ నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంఘటన ఢిల్లీలోని వెలుగుచూసింది. సత్యవాది రాజా హరీశ్చంద్ర హాస్పిటల్‌లో వాధ్వా అనే మహిళ నర్సుగా పనిచేస్తోంది. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలిదశలో టీకా పంపిణీ చేయడంతో వాధ్వా జనవరి 18న తొలి డోస్ తీసుకున్నారు. రెండో డోస్‌ను 28 రోజుల తర్వాత ఫిబ్రవరి 17న వేయించుకున్నారు. అయితే, ఒళ్లు నొప్పులు, చెమటలు పట్టి స్వల్ప అనారోగ్యానికి గురైంది. రోజూ మాదిరిగానే ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తుండగా ఒంట్లో నలతగా ఉన్నట్టు అనిపించడంతో సోమవారం కోవిడ్ పరీక్ష చేయించుకుంది. ఆమెకు నిర్వహించిన కోవిడ్ యాంటీజెన్ పరీక్షల్లో వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీనిపై వాధ్వా మాట్లాడుతూ ‘సోమవారం మధ్యాహ్నం తీవ్రమైన ఒళ్లు నొప్పులు.. విపరీతంగా చెమటలు పట్టాయి.. దీంతో కోవిడ్ పరీక్ష చేయించుకోగా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది’ అని తెలిపారు. యూపీలోనూ ఇటువంటి ఉదంతమే వెలుగుచూసింది. లక్నోలోని సివిల్ ఆసుపత్రికి చెందిన ఒక వైద్యుడికి టీకా రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా కరోనా సోకింది. ఈ తరహా కేసు ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నితిన్ మిశ్రా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నతరువాత వైరస్ బారిన పడ్డారు. డాక్టర్ మిశ్రా కొవాగ్జిన్ తొలి డోస్ ఫిబ్రవరి 15న తీసుకోగా.. మార్చి 16న రెండో డోసు తీసుకున్నారు. ఆ తరువాత స్వల్పంగా అనారోగ్యానికి గురయిన ఆయన కరోనా టెస్టు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారినపడిన వీరిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా, పూర్తిస్థాయి టీకా తీసుకున్న వ్యక్తులు వైరస్ బారినపడటం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నిపుణులు వ్యాఖ్యానించారు. టీకా 100 శాతం ప్రభావవంతమైంది, కానీ, కోవిడ్ వ్యాక్సిన్ కూడా వైరస్ తీవ్ర నుంచి 100 శాతం రక్షణ కల్పిస్తుందని భావిస్తున్నారు. కోవిడ్ -19 లేదా ఫ్లూ వంటి ఇతర ఇన్ఫెక్షన్లకు వ్యాక్సిన్లు 100 శాతం సమర్ధతను చూపవని ఢిల్లీలోని ఎయిమ్స్ పల్మనాలజీ విభాగం చీఫ్ డాక్టర్ జీసీ ఖిల్నానీ అన్నారు.


By March 23, 2021 at 11:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nurse-tests-positive-for-covid-getting-both-vaccine-doses-in-delhi/articleshow/81645337.cms

No comments