Breaking News

కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన రైతులు.. ఢిల్లీ సరిహద్దుల్లో పక్కా ఇళ్లు, జిమ్‌లు


సాగు చట్టాల విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకోడానికే రైతులు సిద్ధమయ్యారు. గతేడాది నవంబరు 27 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు నిర్వహిస్తోన్న రైతులు.. చట్టాలను రద్దుచేసే వరకూ వెనక్కు తగ్గబోమని పదే పదే స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం దిగిరాకపోవడంతో దీర్ఘకాలిక పోరాటం సాగించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో రాజధాని సరిహద్దుల్లో రైతులు ఏకంగా ఇళ్లను నిర్మించుకుంటున్నారు. టిక్రీ సరిహద్దుల్లో పక్కా ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇందుకు వివిధ ప్రాంతాల నుంచి నిర్మాణ సామాగ్రిని తరలిస్తున్నారు. ఇటుకలు, ఇసుక, సిమెంట్ తరలించి, ఇప్పటికే 12పైగా పక్కాఇళ్లు నిర్మితమయ్యాయి. ఈ సందర్భంగా రైతు సంఘం నేత ఒకరు మాట్లాడుతూ.. గ్రామాల్లో గోధుమ పంట కోతకు వచ్చిందని, ఇటువంటి సమయంలో ట్రాక్టర్, ట్రాలీ అవసరమవుతాయని అన్నారు. ఇప్పటి వరకూ అందరం ట్రాలీలలో ఉంటున్నామని, వాటిని గ్రామాలకు పంపిచేస్తే తాము ఎక్కడ ఉండాలి? అని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసమే ఇక్కడ ఇళ్లను నిర్మించుకుంటున్నామని పేర్కొన్నారు. ఒక్కో ఇంటిని నిర్మించుకునేందుకు రూ. 20- 25 వేల రూపాయల వరకూ ఖర్చవుతుందని అన్నారు. తమ సమస్య పరిష్కారమయ్యే వరకూ ఇక్కడి నుంచి కదిలేదిలేదని రైతులు పునరుద్ఘాటించారు. ఢిల్లీలో వేసవికాలం ఎండలు దంచికొడతాయి. టెంట్లలో అధిక వేడిని తట్టుకోవడం కష్టం. కాబట్టి టెంట్లను తొలగించి, వాటి స్థానంలో తాత్కాలిక గుడిసెలు నిర్మించుకుంటున్నారు. నిరసన ప్రదేశంలో సెలూన్‌లు, జిమ్‌లను కూడా ఇప్పటికే రైతులు ఏర్పాటుచేసుకున్నారు. సింఘూ సరిహద్దుల్లోనూ పక్కా ఇళ్లు నిర్మాణంపై రైతు సంఘాలు చర్చిస్తున్నట్టు ఓ నేత తెలిపారు. ఒక్కోటి రెండంతస్తులు ఉండేటా నిర్మించడానికి ప్రణాళిక వేస్తున్నట్టు కిసాన్ సంయుక్త మోర్చాకు చెందిన కర్మజీత్ సింగ్ అన్నారు. రైతులకు నిత్యావసరాల కోసం చిన్న చిన్న దుకాణాలు వెలిశాయి. అటు స్వచ్ఛంద సంస్థలు సైతం వారికి ఉచితంగా సామాన్లు, దుస్తులు అందజేస్తున్నాయి. సాగు చట్టాల విషయంలో రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇప్పటి వరకూ 10 రౌండ్ల చర్చలు జరిగినా ఎక్కడ వేసిన గొంగొలి అక్కడే అన్నట్టు ఉంది. అటు కేంద్రం, ఇటు రైతులు దిగిరావడంలేదు. ఆందోళనలో భాగంగా మార్చి 26న రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అప్పటికి ఉద్యమం మొదలై నాలుగు నెలలు పూర్తికావస్తుండటంతో బంద్‌ చేపట్టాలని నిర్ణయించాయి. జనవరి 26న రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.


By March 13, 2021 at 03:49PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/eyeing-long-haul-protesting-farmers-build-homes-by-highway-near-delhi-border/articleshow/81483257.cms

No comments