Breaking News

మరో వివాదంలో ఇమ్రాన్.. 700 మిలియన్లకు సెనేట్ సీటు అమ్మకం!


పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని సంచలన ఆరోపణలు చేశారు. సెనేట్‌ సీటు కోసం బలూచిస్థాన్ వ్యాపారవేత్త నుంచి ఇమ్రాన్‌కు భారీగా ముట్టిందని ఆరోపించారు. ‘మార్చి 3న జరిగిన సెనేట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన మొహమూద్ అబ్దుల్ ఖాదిర్‌కు ఇమ్రాన్ సూచనలతో అధికార పాకిస్థాన్ తెహ్రీక్ ఇ-ఇన్సాఫ్ సభ్యులు అనుకూలంగా ఓటేశారని, ఇందుకు ప్రతిఫలంగా 700 మిలియన్లు అందుకున్నారు’అని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ ఉపాధ్యక్షుడు ధ్వజమెత్తారు. సెనేట్ టిక్కెట్‌ను అమ్ముకున్న ప్రధాని దీనిపై సమాధానం చెప్పాలని అబ్బాసీ నిలదీశారు. ఇమ్రాన్ ఖాన్‌కు డబ్బులు ఇవ్వడం వల్లే అబ్దుల్ ఖాదిర్ సెనేటర్‌గా గెలిచారని అధికార పార్టీ సభ్యులు కూడా చెవులు కొరుక్కుంటున్నారని ఆరోపించారు. వ్యాపారవేత్తకు సెనేట్ టిక్కెట్ అమ్ముకున్న విషయమై విచారణ జరిపించాలని ఎన్నికల కమిషన్‌ను అబ్బాసీ కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన ఖాదిర్‌ను తర్వాత ఇమ్రాన్ తన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలూచిస్తాన్ నాయకత్వం, జోనల్ స్థాయి నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అంతకు ముందు కేంద్ర నాయకత్వం ఖాదిర్‌కు ఇచ్చిన టికెట్ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం, అతడి పార్టీ నేతల అవినీతికి అంతులేకుంగా పోతోంది.. కానీ, కోర్టులు, అవినీతి నిరోధక వ్యవస్థలు మౌనంగా ఉన్నాయని అబ్బాసీ దుయ్యబట్టారు. ‘ఇటువంటి అవినీతి వ్యవహారాల్లో కోర్టులు సుమోటాగా స్వీకరించాలి.. గతంలో ప్రజలు ఎన్నుకున్న ప్రధాని నవాజ్ షరీఫ్ విషయంలో సుమోటాగా స్వీకరించి, అధికారం నుంచి తొలిగించాయి.. ప్రస్తుతం ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు’ అని మండిపడ్డారు. అంతేకాదు, సైన్యం రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాజకీయాల్లో సైన్యం జోక్యం లేదని డీజీ (ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తిఖార్ చెప్పినదానిని మేము విశ్వసించాలనుకుంటున్నాం. కానీ సెనేట్ ఎన్నికలు, ప్రధాన మంత్రిపై అవిశ్వాస తీర్మానం విషయంలో ఏమి జరిగింది.. ఇది ఆ ప్రకటనకు భిన్నంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ సభ్యులకు ఫోన్‌లు చేసి, సెనేట్ ఛైర్మన్ పదవికి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి యూసఫ్ రజా గిలానీకి ఓటువేయొద్దని బెదిరిస్తున్నారని పరోక్షంగా ఐఎస్ఐపై ఆరోపణలు గుప్పించారు.


By March 12, 2021 at 03:39PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistans-former-pm-accuses-imran-khan-of-receiving-pkr-700-million-for-senate-seat/articleshow/81466126.cms

No comments