Breaking News

18 మందిని పెళ్లాడి డబ్బు, నగలతో పరార్.. రాజస్థాన్‌లో పట్టుబడ్డ తెలుగమ్మాయి!


పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న యువతిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 18 మందిని పెళ్లిచేసుకుని, కొద్ది రోజుల తర్వాత ఇళ్లలోని నగదు, నగలు దోచుకుని పరారయ్యింది. ఈ కిలాడీ లేడీని గుజరాత్‌లో పట్టుకున్నారు. భాగ్‌వతి అలియాస్‌ అంజలి అనే యువతిని రాజస్థాన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతిగా భావిస్తారు. యువతితోపాటు ముఠాకు చెందిన మరో ఐదుగురినీ జునాగఢ్‌లో అరెస్ట్ చేశారు. ఈ ముఠా గుజరాత్‌, మద్యప్రదేశ్‌, రాజస్థాన్‌‌లో పలువురిని మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. జునాగఢ్‌కు చెందిన ఓ యువకుడి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముఠా గుట్టురట్టయ్యింది. అతడి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. మాటువేసి పట్టుకున్నారు. మారుపేరు, నకిలీ పత్రాలతో ఆ యువతి గుజరాత్‌లో ఉన్నట్లు విచారణలో వెల్లడయ్యింది. డబ్బున్న యువకులను టార్గెట్ చేసి, పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వారి దగ్గర ఉన్న నగలు, నగదుతో ఉడాయించడం ఈ ముఠా పని. జునాగఢ్‌ పరిధిలోని అంబాలియా గ్రామానికి చెందిన బాధితుడిని వివాహం చేసుకున్న అంజలి, అతడి ఇంటలో ఉన్న నగలు, రూ.3 లక్షల నగదుతో పారిపోయింది. తను మోసపోయానని గ్రహించిన యువకుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తీగలాగితే డొంక కదలినట్టు ఆమె మోసమంతా వెలుగులోకి వచ్చింది. నిందితులు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ప్రాంతంలో ఉన్నారని ఆచూకీ తెలియడంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అంజలి, ఆమె తల్లి ధనుబెన్‌లను పోలీసులు అరెస్టుచేశారు. అక్కడ నుంచి రాజస్థాన్‌కు తరలించి విచారించారు. విచారణలో వారు చెప్పిన విషయాలు పోలీసులను షాక్‌కు గురిచేశాయి. ఏకంగా 18 మంది యువకులు వీరి చేతిలో మోసపోయినట్లు వెల్లడించారు. నిందితులను కోర్టు ముందుంచగా.. వారికి రిమాండ్ విధించింది. ముఠా మొత్తాన్ని విచారిస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని అంటున్నారు.


By March 21, 2021 at 11:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telugu-women-bhagvathi-held-who-cheated-through-18-fake-marriages-and-flees-with-cash/articleshow/81613639.cms

No comments