Breaking News

సరిహద్దు ఉద్రికత్తలపై రాజ్‌నాథ్ ప్రకటన.. చైనా వెనక్కు మళ్లడానికి కారణం ఇదే


తూర్పు లడఖ్ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా భారత్-చైనాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన క్రమంగా వీడుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి వివాదాస్పద ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని వెనక్కు మళ్లించడానికి ఇరు దేశాలూ ఒక అంగీకారానికి వచ్చాయి. తాజాగా, సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. సరిహద్దు ప్రతిష్టంభనకు తెరదించేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నట్టు రాజ్‌నాథ్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందం వల్ల భారత్‌ నష్టపోలేదని పేర్కొన్నారు. సరిహద్దులో భారత సైన్యం అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిందని, చైనాకు ఒక్క అంగుళం భూమి కూడా వదులుకునేది లేదని రక్షణ మంత్రి పునరుద్ఘాటించారు. ‘తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తన బలగాలను భారీగా మోహరించి, ఆయుధాలను తరలించింది.. దీనికి మన సైన్యం కూడా ప్రతిచర్య ప్రారంభించి చైనాను ఎదుర్కొనేందుకు సమర్థ బలగంతో సిద్ధమైంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మన సైన్యాలు రుజువు చేశాయి’ అని రాజ్‌నాథ్‌ ప్రశంసించారు. సరిహద్దు సమస్యలు చర్చలతోనే పరిష్కారమవుతాయని చైనాకు పదేపదే స్పష్టం చేశామని రాజ్‌నాథ్ అన్నారు. వాస్తవాధీన రేఖను ఇరు దేశాలు అంగీకరించాలని, ఏకపక్ష ధోరణి ఆమోదయోగ్యం కాదని చైనాకు అర్థమయ్యేలా వివరించామన్నారు. సరిహద్దు ప్రతిష్టంభనపై చైనాతో జరిగిన నిరంతర చర్చలతో పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాలపై భారత్-చైనాల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ‘ఈ ఒప్పందంతోనే ఇరు దేశాలూ దశల వారీగా, పరస్పర సమన్వయంతో సరిహద్దుల నుంచి బలగాలను ఉపసంహరించనున్నాయి. దేశ సార్వభౌమత్వం కాపాడటంలో మనం ఎంత పట్టుదలగా ఉంటామో చైనాకు తెలుసు.. మిగతా సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు భారత్‌తో కలిసి చైనా పనిచేస్తుందని భావిస్తున్నాం’అని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు. ‘అక్రమంగా భారత భూభాగాన్ని చైనాకు పాకిస్థాన్ కట్టబెట్టింది.. కానీ మనం ఎప్పుడూ దాన్ని గుర్తించలేదు. భారత్‌లోని కొంత భూభాగం తమదేనంటూ చైనా చాలాసార్లు ఆరోపించింది.. అయితే ఆ అనవసర ఆరోపణలను భారత్‌ ఎప్పుడూ ఒప్పుకోదు.. మనది అంగుళం భూమిని కూడా వదులుకోం’అని రాజ్‌నాథ్‌ కుండబద్దలు కొట్టారు.


By February 11, 2021 at 12:20PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/defence-minister-rajnath-singh-says-big-breakthrough-in-china-standoff-eastern-ladakh/articleshow/80835630.cms

No comments