Breaking News

ఉన్నావ్ బాలికల డెత్ మిస్టరీ: షాకింగ్.. ఒకరి కోసం స్కెచ్ వేస్తే వేరే ఇద్దరు బలి!


యూపీలోని ఉన్నావ్ జిల్లాల్లో ఇద్దరు బాలికల డెత్ మిస్టరీని పోలీసులు చేధించారు. ఇద్దరు అనుమానాస్పద రీతిలో చనిపోగా, అపస్మారక స్థితిలో మరో బాలికను ఊరి చివర పొలాల్లో గుర్తించిన విషయం తెలిసిందే. బాబుహరా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వినయ్‌ కుమార్‌ (28), మరో టీనేజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తన ప్రేమను ఒప్పుకోలేదనే అక్కసుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలిపారు. అస్వస్థతకు గురైన మరో బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు. ముగ్గురి బాలికల్లో ఒకరిని (17) తాను ప్రేమించానని, అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో హత్య చేసినట్టు వినయ్ వెల్లడించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంధువులైన ముగ్గురు బాలికలు పశువులకు గడ్డి కోయడానికి బుధవారం ఊరు శివారులోని పొలానికి వెళ్లి ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వారికోసం గాలిస్తుండగా అచేతనంగా పొలాల్లో కనిపించారని అన్నారు. వీరిలో ఇద్దరు అప్పటికే చనిపోగా.. మరో బాలిక అపస్మారక స్థితిలో ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, విచారణ చేపట్టామని తెలిపారు. నిందితుడు వినయ్‌కు ముగ్గురు బాలికలతో లాక్‌డౌన్‌ సమయంలో స్నేహం ఏర్పడింది. రోజూ పొలాల్లో వీరంతా కలుసుకుని సరదగా కాలక్షేపం చేసేవారు. వీరిలో ఓ బాలికను ఇష్టపడిన వినయ్ ఆమెకు తన ప్రేమను తెలియజేశాడు. దీనికి ఆ బాలిక తిరస్కరించింది. నెల రోజుల కిందట ఫోన్‌ నెంబరు అడిగినా ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఆ కోపంతో చంపాలని నిర్ణయించుకుని పథకం వేశాడు. ముందుగా అనుకున్న ప్రకారం బుధవారం పొలానికి వచ్చిన బాలికలకు తన స్నేహితుడితో స్నాక్స్ తెప్పించి ఇచ్చాడు. వారు అవి తిని నీళ్లు అడగటంతో అప్పటికే సీసాలో పురుగుమందు కలిపిన నీటిని ఇచ్చాడు. ఆ నీటిని తాగిన తర్వాత పొలంలోనే వారిని విడిచిపెట్టి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. లక్నో రేంజ్ ఐజీ లక్ష్మి సింగ్ మాట్లాడుతూ.. వినయ్ పొలానికి పక్కనే బాధిత బాలికల పొలం కూడా ఉందని తెలిపారు. ప్రేమను అంగీకరించలేదనే అక్కసుతో తన పొలంలో ఉన్న పురుగుల మందును నీటిలో కలిపి వాటిని ముగ్గురితో తాగించడానికి అన్నారు. పోస్ట్‌మార్టమ్‌లో బాధితుల శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించకపోవడంతో విష ప్రయోగం జరిగినట్టు తేలిందన్నారు. విషం కలిపిన నీళ్లు తాను ప్రేమించిన అమ్మాయితోనే తాగించాలని పథకం వేశాడని, మిగతా ఇద్దర్నీ తాగొద్దన్నా వారు వినిపించుకోలేదని వినయ్ చెప్పినట్టు పేర్కొన్నారు.


By February 20, 2021 at 12:38PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/up-unnao-deaths-accused-held-police-say-poisoned-girls-on-being-rejected/articleshow/81123492.cms

No comments