Breaking News

జయలలితను స్ఫూర్తిగా తీసుకున్న మమతా.. మరో ప్రజాకర్షక పథకానికి శ్రీకారం


అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని తృణమూల్ కాంగ్రెస్.. బెంగాల్ కోటలో కాషాయ జెండా ఎగురువేయాలని బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నాయి. మరో రెండు నెలల్లో పశ్చిమ్ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మరో ప్రజాకర్షక పథకాన్ని ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్‌ను స్ఫూర్తిగా తీసుకుని రూ.5కే భోజనం అందించే ‘మా’ పథకానికి దీదీ శ్రీకారం చుట్టారు. తొలిదశలో కోల్‌కతాలోని 16 కేంద్రాల్లో ‘మా’ వంటశాలలు అందుబాటులోకి రానున్నాయి. క్రమంగా వీటిని రాష్ట్రమంతా విస్తరిస్తామని మమత ప్రకటించారు. భోజనానికి రూ.15 రాయితీని రాష్ట్రప్రభుత్వం భరించనుంది. మధ్యాహ్నం 1.00 నుంచి 3.00 గంటల వరకు ఈ క్యాంటీన్‌లు అందుబాటులో ఉంటాయి. కోల్‌కతాలోని రాష్ట్ర సచివాలయంలో మమతా బెనర్జీ ‘’‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ‘ఇది మా వంటశాల.. మా (అమ్మ) మనకు ఎంతో గర్వకారణం.. అమ్మ ఎక్కడున్నా అంతా మంచే జరుగుతుంది.. తల్లులందరికీ నేను వందనం చేస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో మమతా బెనర్జీ ప్రారంభించిన మూడో ప్రజాకర్షక పథకం మా. అంతకు ముందు ఇంటి వద్దకు ప్రభుత్వ సేవలు తీసుకొచ్చే దౌరే సర్కార్, ప్రజలకు ఆరోగ్య బీమాలను ప్రారంభించారు. మా కిచెన్ ఏడాది పొడవునా ఉంటుందని భావిస్తున్నారు. మమత బెనర్జీ ప్రారంభించిన ఈ పథకం వల్ల కూలీలు, తక్కువ వేతనాలు పొందే ఉద్యోగులకు ప్రయోజనం ఉంటుంది. ఇక, దేశంలో తొలిసారిగా తమిళనాడులో దివంగత జయలలిత పేదలకు తక్కువ ధరకే ఆహారాన్ని అందజేసే అమ్మ క్యాంటీన్‌లు ప్రారంభించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిర క్యాంటీన్‌లను ప్రారంభించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం సైతం 2018 జులైలో అన్న క్యాంటీన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది.


By February 16, 2021 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-cm-mamata-banerjee-rolls-out-affordable-food-scheme-maa-kitchens/articleshow/80960194.cms

No comments