Breaking News

దేశంలో తొలిసారి సెంచరీ దాటేసిన లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే?!


దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూలేని విధంగా పెరుగుతూ వస్తున్నాయి. తొలిసారిగా రూ.100 దాటింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లోని లీటర్ పెట్రోల్ రూ.100.13లకు చేరింది. దేశంలో ఆటోమోటివ్ ఫ్యూయల్ రూ.100 దాటం ఇదే తొలిసారి. మిగతా రాష్ట్రాల్లోనూ లీటర్ పెట్రోల్ రూ.90 మార్క్ దాటడం విశేషం. డీజిల్ ధర కూడా శ్రీగంగానగర్‌లో రూ.92.10గా నమోదయ్యింది. డీజిల్ సైతం దేశవ్యాప్తంగా లీటర్ రూ.80 దాటింది. పన్ను తగ్గింపును తోసిపుచ్చిన కేంద్రం.. ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని చెబుతోంది. అక్టోబరు 2018లో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ .84, డీజిల్ రూ .75.45 కు పెరిగిన తరువాత అక్టోబరు 4న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2, మర్నాడు రూ .1.5 కేంద్రం తగ్గించింది. మొత్తం 18 రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించి వినియోగదారులపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేశాయి. మిగతా రాష్ట్రాల కంటే రాజస్థాన్‌లో పెట్రోల్, డీజిల్‌పై అత్యధిక పన్ను వసూలు చేయడమే ధరల్లో భారీ వ్యత్యాసానికి కారణం. గత నెలలో పెట్రోల్, డీజిల్‌పై రాజస్థాన్ ప్రభుత్వం 2 శాతం వ్యాట్ తగ్గించింది. దీంతో ప్రస్తుతం అక్కడ పెట్రోల్‌పై 36 శాతం వ్యాట్, కిలోలీటర్‌కు రూ.1,500 రోడ్ సెస్, డీజిల్‌పై 26 శాతం వ్యాట్, రూ.1,750 రోడ్డు సెస్ వసూలు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకం, వివిధ సెస్‌లు కారణం. లీటరు పెట్రోల్‌పై కేంద్రం ప్రాథమిక ఎక్సైజ్ సుంకంగా రూ .1.4, రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ కింద రూ .18, ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ కింద రూ .11, వ్యవసాయ సెస్‌ కింద రూ.2.5 వసూలు చేస్తోంది. ఇక, డీజిల్‌పై రూ.1.80 ప్రాథమిక ఎక్సైజ్, రూ.18 రోడ్డు మౌలిక సదుపాయాల సెస్, రూ.8 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రూ.4 వ్యవసాయ సెస్ విధిస్తోంది. కాబట్టి రిఫరెన్స్ మార్కెట్ అయిన ఢిల్లీలోని ఒక వినియోగదారుడు లీటరు పెట్రోల్‌కు రూ .32.9, డీజిల్‌కు రూ .11.8 కేంద్రానికి పన్నులుగా చెల్లిస్తాడు.


By February 18, 2021 at 09:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/petrol-tops-rs-100-litre-for-1st-time-in-sri-ganganagar-in-rajasthan/articleshow/81082499.cms

No comments