Breaking News

కరోనా ప్రభావం.. ప్రపంచం ఎన్ని కోట్ల జీవితకాలాన్ని నష్టపోయిందో తెలుసా?


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ మరణాలతో కలిగే నష్టాన్ని అంచనా వేయడానికి చేపట్టిన అధ్యయనంలో విస్మయానికి గురిచేసే విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ మహమ్మారి 25 లక్షల మందిని బలితీసుకోగా.. తత్ఫలితంగా సుమారు 2 కోట్ల ఏళ్ల జీవితకాలాన్ని ప్రపంచం నష్టపోయిందని అధ్యయనం పేర్కొంది. భారత్‌ సహా 81 దేశాలకు చెందిన కరోనా మరణాల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం అంతర్జాతీయ యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. అధ్యయన ఫలితాలను ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురించారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి సరాసరి ఆయుష్షును లెక్కించిన పరిశోధకులు.. వారి కారణంగా 2,05,07,518 సంవత్సరాల జీవితకాలాన్ని కోల్పోయినట్టు అంచనా వేశారు. వ్యక్తిగతంగా సగటున 16 ఏళ్ల జీవితకాలం కోల్పోయినట్టు పేర్కొన్నారు. సాధారణ ఫ్లూ, హృద్రోగ వ్యాధుల వల్ల కలిగే ఇయర్స్ ఆఫ్ లైఫ్ లాస్ట్ (వైఎల్ఎల్) కంటే ఈ నష్టం 25 నుంచి 50 శాతం ఎక్కువని తేల్చారు. జీవిత కాలం కోల్పోయిన రేటు ఒక వ్యక్తి మరణించే వయసు, వారి ఆయుర్దాయం మధ్య వ్యత్యాసం. సీజనల్ ఫ్లూ కారణంగా కోల్పోయిన జీవితకాలం రేటు కంటే కరోనా కారణంగా 2-9 రెట్లు ఎక్కువ కోల్పోయినట్టు అధ్యయనం పేర్కొంది. మరణాల సంఖ్య పరంగానే కాదు, కోల్పోయిన జీవితాల పరంగా కూడా కోవిడ్ మరణాల ప్రభావం ఎక్కువని మా ఫలితాలు ధ్రువీకరిస్తున్నాయి అని అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. జీవితకాలం కోల్పోయినవారిలో 55 నుంచి 75 ఏళ్లవారు 44.9 శాతం, 55 ఏళ్లలోపు 30.2 శాతం, 75 ఏళ్లు దాటినవారు 25 శాతం ఉన్నట్టు అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, అమెరికాలోని విస్కాన్‌సిన్-మాడిసన్ యూనివర్సిటీ, జర్మనీకి చెందిన మాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ వంటి అంతర్జాతీయ యూనివర్సిటీల పరిశోధకులు పాల్గొన్నారు. కాగా, కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో 44 శాతం పురుషుల జీవన కాలం నష్టమే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అధ్యయనం నిర్వహించిన 35 దేశాలలో కనీసం తొమ్మిది నెలలకు సంబంధించిన సమాచార ఉంది. ఈ సందర్భాలలో మహమ్మారి పూర్తి ప్రభావాలను లేదా కనీసం దాని మొదటి వేవ్‌ను సూచిస్తుంది. ఇతర దేశాలలో ఈ గణాంకాలు మరింత పెరుగుతున్నాయి. ‘ఈ ఫలితాలు కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న పరిస్థితికి అర్థం పడుతున్నాయి... ఈ అధ్యయనం 2021 జనవరి 6 నాటికి కోల్పోయిన జీవితాలపై కోవిడ్ -19 ప్రభావాన్ని తెలియజేస్తుంది’ అని అధ్యయనకర్తలు వ్యాఖ్యానించారు.


By February 24, 2021 at 01:07PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/over-20-million-years-of-life-lost-worldwide-due-to-coronavirus-says-study/articleshow/81186924.cms

No comments