Breaking News

నాకెంతో ఇష్టమైన పాత్ర.. కానీ ‘యన్.టి.ఆర్’లో తీసేశాం: బాలకృష్ణ


విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన కుమారుడు, నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రాలు ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్ - మహానాయకుడు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయాయి. అయితే, తన తండ్రి పాత్రలో నటించాననే సంతృప్తి మాత్రం బాలకృష్ణకు మిగిలింది. అంతేకాదు, ఎన్టీఆర్ పోషించిన ఎన్నో గొప్ప పాత్రలను తిరిగి బాలయ్య పోషించగలిగారు. అలా తండ్రి పోషించిన పాత్రల్లో బాలకృష్ణ నటించిన ఒక పాత్ర భీష్మ. మహాభారతంలో భీష్మాచార్య కథ ఆధారంగా 1962లో వచ్చిన చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు భీష్మ పాత్ర పోషించారు. ఈ పాత్ర అంటే బాలకృష్ణకు చాలా ఇష్టమట. అందుకే, ఈ పాత్రను ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ సినిమా కోసం బాలకృష్ణ పోషించారు. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే, నిడివి ఎక్కువ అవుతుండటంతో భీష్మ సన్నివేశాలను తొలగించారట. దీంతో, ప్రేక్షకులు బాలకృష్ణను భీష్ముడిగా చూడలేకపోయారు. అందుకే, నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా తన భీష్ముడి పాత్రకు సంబంధించిన స్టిల్స్‌ను బాలయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాం. అందులో నేను భీష్మునిగా నటించాను. అయితే నిడివి ఎక్కువ అవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను’’ అని అన్నారు.


By February 23, 2021 at 03:55PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/on-the-occasion-of-bheeshma-ekadasi-nandamuri-balakrishna-released-stills-of-his-bheeshma-character/articleshow/81171129.cms

No comments