Breaking News

ఏప్రిల్ నుంచి అన్ని రైళ్లు పునరుద్ధరణ.. రైల్వే శాఖ క్లారిటీ


కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా గతేడాది మార్చి 25 నుంచి సాధారణ రైలు సర్వీసులను రైల్వే శాఖ నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది. అయితే, ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీడియాలో వస్తున్న కథనాలపై రైల్వే శాఖ స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను తోసిపుచ్చిన రైల్వే శాఖ.. ఫలానా తేదీ అని తాము నిర్ణయించలేదని పేర్కొంది. ఏప్రిల్‌‌లో ఫలానా తేదీ నుంచి అన్ని రైళ్లను ప్రారంభిస్తారంటూ కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయని రైల్వే శాఖ పేర్కొంది. అయితే, తాము ఎటువంటి తేదీని నిర్ణయించలేదని స్పష్టం చేసింది. ఇప్పటికే 65 శాతం రైళ్లు అందుబాటులో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. జనవరిలో 250 రైళ్లను ప్రారంభించామని, దశలవారీగా రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామని వివరించింది. అదే తరహాలో భవిష్యత్‌లో సైతం మిగితా రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందరి అభిప్రాయాలను తీసుకుంటామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్‌ నేపథ్యంలో రైళ్లన్నీ పూర్తిగా నిలిచిపోగా.. ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల పేరిట కొన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రయాణికుల వల్ల రైల్వేకు వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే డిసెంబరు 2020 నాటికి రైల్వే ఆదాయం రూ.36,993 కోట్ల కోల్పోయింది. ఇందులో ప్రయాణికుల ఆదాయమే రూ.32,768.97 కోట్లు తగ్గిపోయింది.


By February 14, 2021 at 07:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/railways-clarifies-about-resumption-of-full-passenger-train-services-from-april/articleshow/80904131.cms

No comments