Breaking News

భారత్ బంద్‌: వ్యాపార వర్గాలకు మద్దతు ప్రకటించిన రైతు సంఘాలు


పెరుగుతున్న పెట్రో ధరలు, జీఎస్టీ నియమ నిబంధనల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్‌లకు నిరసనగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) భారత్ బంద్‌‌కు పిలుపునిచ్చింది. ఈ భారత్ బంద్‌కు పలు రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి ప్రాతినిథ్యం వహిస్తున్న 40,000 సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ ప్రకటించారు. దాదాపు కోటి మంది దాకా ఉన్న లారీ యజమానుల సంఘం, అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం కూడా ఈ బంద్‌కు మద్దతిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలతో రెండు కీలక వ్యాపార సంఘాలు విభేదించాయి. బంద్‌లో తాము పాల్గొనబోవడం లేదని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా వ్యాపార్‌ మండల్‌, భారతీయ ఉద్యోగ్‌ వ్యాపార్‌ మండల్‌ స్పష్టం చేశాయి. ఈ రెండు సంఘాల కింద వందల సంఖ్యలో ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. ‘తొలుత వెల్లడించిన లక్ష్యాల నుంచి జీఎస్టీ పక్కదారి పట్టింది.. అనేక రాక్షస నిబంధనలు చేర్చడంతో ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) వ్యాపారులకు లభించడం కష్టమవుతోంది. అది ఇవ్వకపోవడం వల్ల అదనపు భారం పడుతోంది. ఈ విషయం గురించి దేశంలోని పలు వ్యాపార సంఘాలు 200 జిల్లాల కలెక్టర్ల ద్వారా ఫిబ్రవరి 22న ప్రధాని మోదీకి మెమొరాండం పంపాయి. ఒకవేళ దాన్ని పట్టించుకోకపోతే 500 జిల్లాల నుంచి మరోసారి గుర్తుచేస్తాం. అప్పటికీ నిర్ణయం మారకపోతే కార్యాచరణ మొదలుపెడతాం. జీఎస్టీ నియమాల్ని తిరగరాయాల్సిందే’ అని ఫెడరేషన్‌ ఆఫ్‌ వ్యాపార్‌ మండల్‌ నేత వీకే బన్సాల్‌ చెప్పారు. కాగా, సీఏఐటీ ఇచ్చిన బంద్‌ పిలుపునకు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సంఘీభావం ప్రకటించింది. చమురు ధరలు తగ్గించకపోతే త్వరలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా లారీ యజమానులు లారీలను బయటకు తీయవద్దని అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు గురువారం పిలుపునిచ్చారు. అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇచ్చాయి. ఈ బంద్‌కు మద్దతు ప్రకటించిన సంయుక్త కిసాన్ మోర్చా.. రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. రైతు సంఘం నేత డాక్టర్ దర్శన్ పాల్ మాట్లాడుతూ.. జీఎస్టీ, చమురు ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపార వర్గాలకు రైతుల మద్దతు ఉంటుందని తెలిపారు. బంద్‌లో భాగంగా అన్ని వాణిజ్య మార్కెట్లు మూసివేయనున్నట్టు ట్రేడర్స్ అసోసియేషన్ తెలిపింది.


By February 26, 2021 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmer-unions-extended-support-to-traders-and-to-join-bharat-bandh-today/articleshow/81221089.cms

No comments