Breaking News

భారత్ లక్ష్యంగా మరో క్షిపణిని పరీక్షించిన పాక్.. మూడు వారాల్లో మూడోది!


దాయాది పాకిస్థాన్ వరుసగా మూడు వారాల్లో మూడు క్షిపణులను పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించే బాబర్‌ క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు పాకిస్థాన్‌ ఆర్మీ గురువారం వెల్లడించింది. ఈ క్షిపణి 490 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని పేర్కొన్నది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ ట్యూబ్ మిసైల్ లాంచ్ వేహికల్ నుంచి దీనిని పరీక్షించినట్టు తెలిపింది. పరీక్ష విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు పాక్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. క్షిపణి పరీక్షకు నేషనల్ ఇంజినీరింగ్ అండ్ సైంటిఫిక్ కమిషన్ ఛైర్మన్ రాజా సమర్, ఆర్మీ స్ట్రాటజీక్ ఫోర్సెస్ కమాండ్‌ లెఫ్టినెంట్ జనరల్ ముహమూద్ అలీ, వ్యూహాత్మక ప్లాన్ విభాగం, స్ట్రాటజీక్ ఫోర్సెస్ ఉన్నతాధికారులు తదితరులు హాజరయ్యారు. ‘సాయుధ దళాల శిక్షణ, కార్యాచరణ సంసిద్ధత ఈ రంగంలో ఆయుధ వ్యవస్థ నైపుణ్యం నిర్వహణ ద్వారా ప్రతిబింబిస్తుంది’ అని నెస్కామ్ ఛీఫ్ సమర్ అన్నారు. పాక్ వ్యూహాత్మక సామర్థ్యాన్ని పెంపొందించడానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సహకారం ప్రశంసనీయమని అన్నారు. ఈ బాబర్-3 క్షిపణికి అణ్వస్త్ర సామర్థ్యం ఉందని పాక్ గతంలోనే ప్రకటించింది. ఇది 450 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను కచ్చితత్వంతో తాకగలదని వెల్లడించింది. శత్రువు కంట పడకుండా, రక్షణ శ్రేణిని దాటుకొని ఈ క్షిపణి లక్ష్యాలను చేరుకుంటుందని.. దీనికి సెకండ్ స్ట్రైక్ సామర్థ్యం కూడా ఉందని పేర్కొంది. భారత్ లక్ష్యంగా పాకిస్థాన్ అణ్వాయుధాలను తరుచూ ప్రయోగిస్తోంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను భారత్ రద్దుచేసిన తర్వాత దాయాది మరింతగా రెచ్చగొడుతోంది. కయ్యానికి కాలుదువ్వుతూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఒక దశలో భారత్‌తో యుద్ధం తప్పదంటూ పరోక్షంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిన పాక్.. అణు యుద్ధానికి కూడా కూడా వెనుకాడబోమని ప్రకటించింది. తరుచూ అణ్వాయుధాలను ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణిలను పరీక్షిస్తోంది.


By February 12, 2021 at 10:36AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistan-successfully-test-fires-surface-to-surface-babur-cruise-missile/articleshow/80874252.cms

No comments