Breaking News

కిమ్ దెబ్బకు రైలు ట్రాలీని తోసుకుంటూ వెళ్లిన మిత్రదేశం దౌత్యవేత్తలు!


చైనాలో కరోనా వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలోనే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోన్‌ ఉంగ్‌ తమ దేశ సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. మహమ్మారిని కట్టడి చేయడానికి కిమ్ విధించిన ఆంక్షలు.. ఉత్తర కొరియాలో రష్యా దౌత్యవేత్తలను ముప్పతిప్పలు పెట్టాయి. రాకపోకలపై నిషేధం విధించడంతో స్వదేశానికి వెళ్లేందుకు నానా అగచాట్లు పడ్డారు. రైలు పట్టాలపై ట్రాలీని తోసుకుంటూ కుటుంబాలతో సహా బతుకు జీవుడా అంటూ సరిహద్దులను దాటాల్సి వచ్చింది. చైనాలో కరోనా మహమ్మారి బయటపడిన వెంటనే పొరుగున ఉన్న ఉత్తరకొరియా మేల్కొంది. సరిహద్దులను పూర్తిగా మూసేసి ఇతర దేశాలతో సంబంధాలు తెంచుకుంది. విమానాలు, రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. దీంతో చాలా మంది విదేశీయులు ఉత్తర కొరియాలోనే చిక్కుకుపోయారు. ప్రయాణాలపై నిషేధంతో చాలాకాలం అక్కడే ఉండిపోయిన ఎనిమిది మంది రష్యా దౌత్య సిబ్బంది ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. అయితే, ఇందుకు వారు చాలా శ్రమించాల్సి వచ్చింది. మొత్తం 32 గంటలు రైల్లో ప్రయాణించి, తర్వాత మరో రెండు గంటలు బస్సులో వెళ్లి ఉత్తర కొరియా - రష్యా సరిహద్దు సమీపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రైలు పట్టాలపై ట్రాలీని తోసుకుంటూ కిలోమీటరు దూరం ప్రయాణించి స్వదేశానికి చేరుకున్నట్లు రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. అత్యంత క్లిష్టమైన, సుదీర్ఘ ప్రయాణం చేశారని వివరించింది. చివరకు కాలినడకన దేశానికి చేరుకున్నట్టు తెలిపింది. దౌత్యవేత్తలు తమ భార్యపిల్లలను ట్రాలీలో కూర్చోబెట్టి, ముందుభాగంలో తమ లగేజీ పెట్టుకుని రైల్వే ట్రాక్‌పై తోసుకుంటూ వస్తున్న ఫొటోలు, వీడియోను రష్యా విదేశాంగ శాఖ తమ ఫేస్‌బుక్‌‌, టెలిగ్రామ్ ఖాతాల్లో షేర్ చేసింది. రష్యా భూభాగంలోకి వారు అడుగుపెట్టిన తర్వాత విదేశాంగ శాఖ అధికారులు కలుసుకుని బస్సులో వ్లాడివోస్టక్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విమానంలో మాస్కో చేరుకున్నట్లు రష్యా పేర్కొంది. కరోనా కట్టిడికి కఠిన ఆంక్షలు తీసుకొచ్చిన ఉత్తరకొరియా తమని తాము వైరస్‌ రహిత దేశంగా ప్రకటించుకుంది. అయితే ఆంక్షల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. పలు దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేసి, సిబ్బందిని వెనక్కు తీసుకెళ్లాయి. అయితే, ఉత్తర కొరియాతో రష్యాకున్న సన్నిహిత సంబంధాలు కారణంగా దౌత్య సిబ్బందిని కొన్నాళ్లు అక్కడే ఉంచింది. ఉత్తర కొరియా ఏర్పాటులో నాటి రష్యా అధ్యక్షుడు స్టాలిన్ కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. రాజధాని ప్యాంగ్‌యాంగ్ నగరం మధ్యలో రష్యా అతిపెద్ద దౌత్య కార్యాలయం నిర్మించింది.


By February 27, 2021 at 01:31PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/russian-diplomats-returned-from-north-korea-on-rail-trolley-due-travel-ban/articleshow/81242500.cms

No comments