Breaking News

ఆ రోజు భారత్, చైనా యుద్ధానికి సిద్ధపడ్డాయి.. లెఫ్టినెంట్ జనరల్ సంచలన వ్యాఖ్యలు!


తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్‌, చైనాల మధ్య తొమ్మిది నెలల పాటు కొనసాగిన ప్రతిష్టంభన క్రమంగా వీడుతోంది. ఇరువైపులా బలగాల ఉపసంహరణ వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపై ఇండియన్ ఆర్మీ ఉత్తర కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషీ సంచలన విషయాలను బయటపెట్టారు. లేహ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది ఆగస్టులో చైనాతో యుద్ధం అంచుల వరకు భారత్‌ వెళ్లిందని జోషీ తెలిపారు. ఒకానొక దశలో యుద్ధానికి వెళ్లినా భారత్‌ చాకచక్యంగా చైనాను నిలువరించిందని వెల్లడించారు. ‘గల్వాన్‌ లోయలో ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.. చైనా ఊహించని విధంగా ఆగస్టు 29-30 మధ్య పాంగాంగ్‌ సరస్సుకు దక్షిణాన వ్యూహాత్మకంగా కీలకమైన కైలాశ్‌ రేంజ్‌ను భారత్ అధీనంలోకి తెచ్చుకుంది. ఈ హఠాత్పరిణామానికి కంగుతిన్న చైనా ప్రతిచర్యకు దిగింది. ఆగస్టు 31న కైలాశ్‌ రేంజ్‌ సమీపంలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి’అని అన్నారు. శత్రువుల యుద్ధ ట్యాంక్‌ అత్యంత సమీపంగా రావడంతో సైన్యం అప్రమత్తమయ్యిందని, ఆ సమయంలో భారత్ సంయమనంతో వ్యవహరించిందని జోషీ పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి ఆపరేషన్లయినా చేపట్టేందుకు మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చినా, చైనా దళాలపై కాల్పులు జరపకుండానే నిలువరించగలిగామని తెలిపారు. భారత్‌ దాదాపు యుద్ధం అంచుల వరకు వెళ్లిందని, ఆ సమయంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నామని అని తెలియజేశారు. పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ప్రస్తుతం బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని జోషీ తెలిపారు. గల్వాన్‌ లోయలో ఘర్షణల గురించి కూడా ప్రస్తావించిన జోషీ.. ఆ ఘర్షణల్లో చాలా మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారన్నారు. భారత సైనిక పోస్టుల పరిశీలన ప్రకారం.. ‘పెద్ద సంఖ్యలో పీఎల్‌ఏ సైనికులను స్ట్రెచర్‌లపై తిరిగి తీసుకువెళ్లాయి. వీరు దాదాపు 60 మంది వరకు ఉంటారు, కానీ వీరంతా ఘర్షణలో చనిపోయిన వ్యక్తులా? గాయపడినవారా? అనేది అస్పష్టమని’ అన్నారు.


By February 18, 2021 at 01:39PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/border-row-india-china-came-close-to-war-last-year-says-lt-gen-yk-joshi/articleshow/81086660.cms

No comments