Breaking News

లాకర్ నిర్వహణపై బ్యాంకులకు సుప్రీంకోర్టు షాక్.. ఆర్బీఐకి కీలక ఆదేశాలు


బ్యాంక్ లాకర్ల నిర్వహణ మార్గదర్శకాలపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. బ్యాంకులు ప్రజా ఆస్తుల సంరక్షకులని, లాకర్ల నిర్వహణ తీరు గురించి తెలియదనే నేపంతో కస్టమర్లను ఇబ్బంది పెట్టలేరని శుక్రవారం వ్యాఖ్యానించింది. ప్రస్తుత లాకర్ నిర్వహణ నిబంధనలు గందరగోళంగా ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు, ఆరు నెలల్లోగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా () లాకర్ సౌకర్యాల నిర్వహణపై కొత్త మార్గదర్శకాలను నిర్వహించి, దేశవ్యాప్తంగా బ్యాంకులు అమలు చేసేలా చూడాలని సూచించింది. ‘లాకర్ నిర్వహణ గురించి తెలియకపోవడం వల్ల తమ ఆస్తులను భద్రపరచడంలో విఫలమవుతున్నారనే తప్పుడు అభిప్రాయంలో బ్యాంకులు ఉన్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానంగా బ్యాంక్, లాకర్ హోల్డర్ల మధ్య వివాదం ఈ పంథాలో కొనసాగడానికి మేం అనుమతించలేం’ అని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) కలకత్తా బ్రాంచ్ కేసు విచారణ సందర్భంగా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేసు వివరాల్లోకి వెళితే కలకత్తాకు చెందిన అమితాబ్ దాస్‌గుప్తాకు యూబీఐలో లాకర్ ఉంది. అమితాబ్ బకాయిలను చెల్లించలేదనే సాకుతో లాకర్‌ను అతడికి తెలియకుండానే బ్యాంకు అధికారులు రద్దు చేశారు. అతడి అనుమతి లేకుండా తెరిచి లాకర్‌లో ఉంచిన ఆభరణాలను తిరిగి ఇచ్చారు. అయితే, అందులో కొన్ని మిస్ కావడంతో వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు. జిల్లా వినియోగదారుల కోర్టు అమితాబ్‌కు అనుకూలంగా తీర్పు నిచ్చింది. అతడికి నష్టపరిహారం కింద రూ.3 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీనిని బ్యాంకు సిబ్బంది రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో సవాల్ చేయడంతో దానిని రూ.30,000కు తగ్గించింది. దీంతో అమితాబ్ జాతీయ వినియోగదారుల ఫోరంలో సవాల్ చేస్తే రాష్ట్ర ఫోరం నిర్ణయాన్ని సమర్ధించింది. చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు విచారణ సందర్భంగా బ్యాంకు సిబ్బంది తీరును తప్పుబట్టిన న్యాయస్థానం.. కస్టమర్‌కు సమాచారం ఇవ్వకుండా అతడి లాకర్ తెరిచినందుకు రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ చర్యలకు పాల్పడిన అధికారుల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. అంతేకాదు, లిటిగేషన్ ఖర్చుల కింద కస్టమర్‌ను రూ.లక్ష చెల్లించాలని సూచించింది. ‘లాకర్ తెరిచే ముందు కస్టమర్‌కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. లాకర్ నిర్వహణపై ఆరు నెలల్లోగా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను రూపొందించాలి. లాకర్లలో వస్తువులను మాయమైతే బ్యాంకులనే బాధ్యులు చేసేలా నిబంధనలు ఉండాలి. లాకర్ విషయాలు తెలియవని చెప్పి ఆ బాధ్యత నుంచి బ్యాంకులు తప్పించుకోలేవు’ అని న్యాయస్థానం పేర్కొంది.


By February 20, 2021 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-tells-rbi-for-frame-new-bank-locker-rules-in-6-months/articleshow/81120627.cms

No comments