Breaking News

ప్రతి సందర్భాల్లోనూ నిరసన తెలియజేయడం కుదరదు.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు


‘నిరసన తెలియజేయడం, అసమ్మతిని వ్యక్తం చేసే హక్కు కొన్ని విధులతో వస్తుంది... అది ఎల్లప్పుడు, ప్రతిచోటా నిర్వహించడం కుదరదు’ అని శుక్రవారం వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని షాహీన్ బాగ్‌‌లో‌ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు చట్టవిరుద్దమని ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. షాహీన్ బాగ్ వద్ద జరిగిన సీఏఏ వ్యతిరేక నిరసనలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పుపై 12 మంది హక్కులు కార్యకర్తలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రివ్యూ పిటిషన్‌‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు..‘అన్ని సందర్భాల్లో, ప్రతి చోట నిరసన తెలియజేయడం కుదరదు.. కొన్నిసార్లు ఆకస్మిక నిరసనలు తెలపొచ్చు.. కానీ, ఇతరుల హక్కకులను ప్రభావితం చేసే బహిరంగ ప్రదేశాలలో సుదీర్ఘమైన అసమ్మతి లేదా నిరసన కొనసాగించడం సాధ్యం కాదు’ అని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిరసనల కోసం బహిరంగ ప్రదేశాలను ఆక్రమించరాదని, ప్రజా నిరసనలు "నిర్ణీత ప్రదేశాలలో మాత్రమే ఉండాలి అని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ కృష్ణ మురారీ ధర్మాసనం పునరుద్ఘాటించింది. "అసమ్మతి, ప్రజాస్వామ్యం కలిసిపోతాయని, ఇలాంటి నిరసనలు ఆమోదయోగ్యం కాదని ఉన్నత న్యాయస్థానం గతేడాది అక్టోబరులో ఇచ్చిన తీర్పులో నొక్కి చెప్పింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు ఢిల్లీలోని షహీన్ బాగ్ మూల కేంద్రంగా నిలిచిన విషయం తెలిసిందే. డిసెంబరు 2019లో ప్రారంభమైన ఈ ఆందోళనల్లో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు నెలలకుపైగా ఈ ఆందోళనలు కొనసాగాయి. ఈ ఆందోళనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ ఆందోళనలో పాల్గొన్న 80 ఏళ్ల వృద్ధరాలు బిల్కిస్ దాదీని టైమ్స్ మ్యాగిజైన్ 100 మంది ప్రభావిత వ్యక్తుల జాబితాలో చేర్చింది.


By February 13, 2021 at 01:07PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/right-to-protest-cannot-be-anytime-everywhere-says-sc-on-shaheen-bagh-anti-caa-protest/articleshow/80894068.cms

No comments