Breaking News

మార్చి 31 వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గతేడాది మార్చి 25 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మరోసారి నిషేధాన్ని పొడిగించింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై డీజీసీఏ విధించిన నిషేధం ఫిబ్రవరి 28తో ముగియనుంది. అయితే, దేశంలోని కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 31 వరకు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం పొడిగిస్తూ డీజీసీఏ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. కార్గో విమానాలు, ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా నడుస్తున్న ప్రత్యేక విమానాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ తర్వాత సుమారు 27 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. ఈ దేశాల నుంచి భారత్‌కు రాకపోకలు సాగించే విమానాలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో గతేడాది మార్చి 25 నుంచి పూర్తిగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత మే 25 నుంచి దేశీయ విమానాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కానీ, గత 11 నెలలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ అలాగే కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు నెల రోజుల పాటు ఈ నిషేధాన్ని పొడిగించడం గమనార్హం. మరోవైపు, లగేజ్‌ లేకుండా ప్రయాణించేవారికి త్వరలో టికెట్ ధరల్లో రాయితీ కల్పించనున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. చెక్‌ ఇన్‌ లగేజ్‌ లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో మాత్రమే ప్రయాణించేవారికి టికెట్లపై డిస్కౌంట్లు కల్పించనున్నారు. విమాన ప్రయాణికులు 7 కిలోల వరకు క్యాబిన్‌ బ్యాగేజ్‌, 15 కిలోల వరకు చెక్‌ఇన్‌ లగేజ్‌లను తీసుకెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ లగేజ్‌ తీసుకెళ్లాలనుకునే వారికి అదనపు ఛార్జీలు విధిస్తున్నారు. తాజా నిబంధనల ప్రకారం.. ఇకపై చెక్‌ఇన్‌ బ్యాగ్‌లు లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో మాత్రమే ప్రయాణించే వారికి విమానయాన సంస్థలు టికెట్ల ధరలో డిస్కౌంట్ ఇస్తారు.


By February 27, 2021 at 12:39PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/restrictions-on-international-passenger-flights-extended-till-march-31-dgca/articleshow/81241948.cms

No comments