Breaking News

ఉత్తరాఖండ్ విషాదం: బిడ్డకోసం ఓ తల్లి ఆరాటం.. 25 మంది ప్రాణాలు నిలబెట్టింది


గత ఆదివారం ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న ప్రకృతి విలయతాండవంలో ఇప్పటి వరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 164 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. తపోవన్ విద్యుత్ కేంద్రం సొరంగం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 120 మీటర్ల మేర పూడికను తీయగా ఆదివారం ఉదయం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో లోపలివారు ప్రాణాలతో ఉంటారనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. మరోవైపు, ఫిబ్రవరి 14 నుంచి 16 వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, తన కుమారుడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసిన తల్లిడిల్లిపోయిన ఓ తల్లి పదే పదే కొడుక్కి చేసిన ఫోన్ కాల్ 25 మంది ప్రాణాలను నిలబెట్టింది. ఉత్తరాఖండ్ జలప్రళయంలో అదృష్టవశాత్తూ తప్పించుకున్న విపుల్‌ కైరేనీ బృందం కూడా ఒకటి. విద్యుత్ కేంద్రంలో విపుల్ కైరేనీ అనే వ్యక్తి ఓ భారీ వాహనానికి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవుదినమైనా డ్యూటీకి వెళితే రెట్టింపు వేతనం లభిస్తుందని వెళ్లాడు. విధుల్లో ఉండగానే విపుల్ తల్లి మంగ్‌శ్రీ దేవి పలుసార్లు ఫోన్‌ చేసింది. చాలా సేపటి తర్వాత విపుల్ ఆమె ఫోన్‌ కాల్‌కు సమాధానం ఇవ్వడంతో ఉపద్రవం గురించి వివరించింది. కానీ ఈ విషయాన్ని అతడు తొలుత తేలిగ్గా తీసుకున్నాడు. కానీ తల్లి పదేపదే ఫోన్‌ చేస్తూ సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని చెప్పడంతో అంతగా ఆందోళన చెందుతుందటే నిజమేనని భావించి ఎత్తైన ప్రాంతానికి చేరుకున్నాడు. తనతో పాటు మరో 24 మందిని తీసుకెళ్లడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ‘మా ఊరు కొండ ప్రాంతంలో ఉంటుంది.. నా తల్లి ఇంటి బయట పనులు చేస్తుండగా దౌలిగంగ నది ఉవ్వెత్తున ఎగిసిపడి ముందుకొస్తున్నట్లు గుర్తించి నాకు ఫోన్‌ చేసింది. తొలుత జోక్ చేస్తుందని భావించి ఆ విషయాన్ని నమ్మలేదు. పర్వతాలు ఎక్కడైనా బద్దలవుతాయా నువ్వు జోక్ చేయకు అమ్మ అని నవ్వాను.. ఆమె పదేపదే ఫోన్‌ చేయడంతో నేను, నాతోపాటు మరో 24 మంది విద్యుత్కేంద్రంలోని ఎత్తయిన ప్రాంతంలో ఉన్న మెట్లపైకి చేరుకొని మా ప్రాణాలను కాపాడుకున్నాం. నా తల్లి ఫోన్‌ చేసి హెచ్చరించకపోయి ఉంటే నేను, నాతోటివారు కలిపి మొత్తం 25 మందిమి ప్రాణాలతో ఉండేవాళ్లం కాదు’ అని విపుల్‌ కైరేనీ వెల్లడించారు. ప్రాణాలతో బయటపడిన మిగతావారు ఆ తల్లికి ఎల్లవేళలా రుణపడిఉంటామని కృతజ్ఞత తెలిపారు. ధౌలిగంగ సాధారణ కంటే 15 మీటర్ల ఎత్తుగా ప్రవహించడం మా అమ్మ మాంగ్‌శ్రీ, భార్య అనిత గమనించి ఉపద్రవం ముంచుకొస్తుందని అప్రమత్తం చేశారని అన్నాడు. విపుల్ బృందంలో ఉన్న సందీప్ లాల్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. జీవితాంతం ఆమెకు నేను రుణపడి ఉంటాను.. తల్లిదండ్రులు చేసిన హెచ్చరికలను ఎప్పుడూ పెడచెవిన పెట్టరాదనే సత్యాన్ని గ్రహించాను అన్నాడు. విద్యుత్ కేంద్రంలో సందీప్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు.


By February 14, 2021 at 01:12PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/woman-makes-calls-to-son-amid-uttarakhand-glacier-burst-saves-25-lives/articleshow/80907102.cms

No comments