Breaking News

మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. ఒకే స్కూల్లో 229మంది విద్యార్థులకు పాజిటివ్, లక్షణాలు లేకుండానే!


మహారాష్ట్రలో కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా వషిమ్‌ జిల్లాలో ఓ స్కూల్ హాస్టల్‌లో 233మందికి వైరస్‌ సోకడం కలకలం సృష్టించింది. వైరస్‌ సోకిన వారిలో 229మంది విద్యార్థులు, నలుగురు టీచర్లు ఉన్నారు. వెంటనే అధికారులు స్కూల్ పరిసరాల్ని కంటైన్‌మెంట్‌‌ జోన్‌గా ప్రకటించారు. జనవరి 27న స్కూల్‌ను రీ ఓపెన్ చేయగా.. జనవరి 14న విద్యార్థులు హాస్టల్‌కు వచ్చారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యార్థులకు స్కూల్లో పరీక్షలు చేయించారు. ముందు 30మంది విద్యార్థులకు పాజిటివ్ తేలింది. మొత్తం 327మందికి టెస్టులు చేయిస్తే 229మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. వీరంతా 5 నుంచి 9 తరగతుల విద్యార్థులు.. వీరికి ఎలాంటి లక్షణాలు లేకపోవడం విశేషం. అందుకే అందర్ని స్కూల్ హాస్టల్‌లోనే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అలాగే నెగిటివ్ వచ్చిన విద్యార్థులను ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉంచారు. రెండు మెడికల్ టీమ్‌లు వీరికి వైద్యం అందిస్తున్నాయి. వసతి గృహానికి వచ్చిన విద్యార్థుల్లో.. ఇటీవల మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందిన అమరావతి, యావత్మల్‌ జిల్లాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. వీరిలో 151మంది అమరావతి జిల్లా, మరో 55 మంది యావత్మల్ జిల్లా.. మిగిలినవారు వషిమ్, హింగోలి, బుల్దాన్, అకోలో జిల్లాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. అంతేకాదు మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు అంతకంతకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


By February 25, 2021 at 01:04PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/229-school-students-tests-coronavirus-positive-in-washim-district-maharashtra/articleshow/81205977.cms

No comments