Breaking News

19 ఏళ్ల కిందట గోద్రా రైలు దహనం కేసు.. ఎట్టకేలకు పట్టుబడ్డ ప్రధాన నిందితుడు


గోద్రా రైలు దహనం ఘటనలో ప్రధాన నిందితుడు రఫీక్ హుస్సేన్ భతూక్ 19 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు పట్టుబడ్డాడు. రఫీక్‌ను గోద్రా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 2002 ఫిబ్రవరి 27న అయోధ్య నుంచి కరసేవకులతో వస్తున్న రైలుకు గుజరాత్‌లోని పంచ్‌మహల్ జిల్లాలోని గోద్రా రైల్వే స్టేషన్ వద్ద దుండగులు నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 59 మంది కరసేవకులు సజీవ దహనమయ్యారు. గోద్రా రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే అక్కడ కూలీగా పనిచేసే రఫీక్.. రాళ్లు రువ్వి, పెట్రోల్ పోశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 19 ఏళ్ల క్రితం గోద్రా దుర్ఘటనకు కుట్రపన్నిన కోర్ గ్రూప్‌లో రఫీక్ హుస్సేన్ భటూక్ కీలక సభ్యుడు. పోలీసులకు లభించిన సమాచారం మేరకు రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక ఇంటి వద్ద మాటువేసి, అతడిని పట్టుకున్నారు. ఘటన జరిగిన రోజున రైలు బోగీలను తగులబెట్టేందుకు పెట్రోల్ సిద్ధం చేసిన రఫీక్.. ఈ కుట్రలో కీలకపాత్రధారి అని విచారణలో తేలిందని అన్నారు. రఫీక్‌పై గతంలోనూ పలు కేసులు కూడా ఉన్నాయి. తర్వాత రఫీక్ హుస్సేన్ ఇక్కడి నుంచి పారిపోయి, ఢిల్లీ పరిసరాల్లో తలదాచుకున్నాడు. ఇటీవలే అతడు గోద్రాకు కుటుంబంతో సహా వచ్చినట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మాటువేసి అతనిని పట్టుకున్నారు. రైలు తగలబెట్టిన తర్వాత గోద్రాలోని మొహమాది మెహల్లాలో ఉన్న రఫీక్.. తర్వాత ఫాలియాకు వెళ్లాడు. మరో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. వీరిలో సలీమ్ పన్వాలా, షౌకత్ చర్ఖాలు పాకిస్థాన్‌లో ఉన్నట్టు భావిస్తున్నారు. వీరిపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీచేశారు.


By February 16, 2021 at 10:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/prime-accused-rafik-bhatuk-in-godhra-case-arrested-after-19-years/articleshow/80966379.cms

No comments