ఒక్క రోజు సీఎం, ఒకే ఒక్కడు సినిమాలా.. యువతికి అరుదైన అవకాశం


ఒకే ఒక్కడు సినిమా గుర్తుందిగా.. అందులో హీరో అర్జున్ ఒకే ఒక్క రోజు సీఎంగా బాధ్యతలు చేపట్టి అద్భుతాలు చేస్తాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతికి ఇపపుడు అలాంటి అరుదైన అవకాశమే దక్కింది. జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం () సందర్భంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుంది. సీఎంగా ఒక్క రోజు విధులు నిర్వహించనుంది. ఆ అమ్మాయి పేరు సృష్టి గోస్వామి. సృష్టి గోస్వామిది హరిద్వార్ జిల్లా దౌలత్‌పూర్ గ్రామం. ప్రస్తుతం ఈ యువతి బీఎస్సీ డిగ్రీ చదువుతోంది. 2018లో ఉత్తరాఖండ్ బాలల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. 2009లో థాయిలాండ్‌లో జరిగిన బాలికల అంతర్జాతీయ లీడర్‌షిప్ కార్యక్రమానికి సృష్టి హాజరైంది. ‘సృష్టి బ్రిలియంట్ గర్ల్. తాను అమ్మాయిల అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తోంది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి తరచూ బాలికల్లో స్ఫూర్తి నింపే కార్యక్రమాల్లో పాల్గొంటుంది’ అని సృష్టి తండ్రి ప్రవీణ్ పురీ అన్నారు. గ్రామంలో ఆయన కిరాణాషాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సృష్టి తల్లి అంగన్‌వాడీ వర్కర్‌గా పనిచేస్తున్నారు. ఏటా జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అందులో భాగంగా సృష్టి ఈసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం దక్కింది. ఉత్తరాఖండ్ బాలికల హక్కుల పరిరక్షణ కమిషన్ సృష్టిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం (జనవరి 24) ఉత్తరాఖండ్ వేసవి రాజధాని అయిన గైర్‌సెన్‌లో సృష్టి గోస్వామి.. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై సమీక్ష నిర్వహించనుంది. ఆయుష్మాన్‌భవ, స్మార్ట్ సిటీ, పర్యాటకతో పాటు ఇతర శాఖల కార్యక్రమాలు, పథకాలపై అధికారులతో సీఎం హోదాలో చర్చించనుంది. ఈ సమీక్షకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని.. నివేదికలు రూపొందించి సమావేశానికి హాజరు కావాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అయినా.. ఈ ఘట్టం బాలికల్లో ఎంతో స్ఫూర్తి నింపనుంది. Must Read: ✦ ✦ ✦ ✦
By January 24, 2021 at 06:27AM
No comments