Breaking News

రేపే వైస్-ప్రెసిడెంట్‌గా కమలా ప్రమాణస్వీకారం.. చీర ధరిస్తారా? సూట్ వేసుకుంటారా?


అమెరికా చరిత్రలో మరో కీలక ఘట్టానికి బుధవారం తెరలేవబోతోంది. అగ్రరాజ్యానికి ఓ మహిళ తొలిసారి ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేయబోతుండగా.. ఆ అరుదైన ఘనత భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌కు దక్కడం విశేషం. ఈ నేపథ్యంలో కమలా ప్రమాణస్వీకారంపై ఆసక్తి నెలకుంది. ఆమె వస్త్రధారణ విషయంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆమె భారతీయతను ప్రతిబింబించేలా చీరను ధరిస్తారా? పాశ్చాత్యుల మాదిరిగా సూటు వేసుకుంటారనేది చర్చనీయాంశమవుతోంది. అయితే, చీరను ధరించి అధికారాన్ని స్వీకరిస్తారనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఆసియా అమెరికా సంతతి కమ్యూనిటీ నెవాడాలో 2019లో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో మీరు విజయం సాధిస్తే చీర కట్టుకుంటారా అని కమలను ఓ ప్రేక్షకుడు ప్రశ్నించినప్పుడు.. ముందు గెలుద్దాం అని ఆమె సమాధానమిచ్చారు. ‘భారతీయ సంస్కృతి, వారసత్వం పట్ల తమకు అమిత గౌరవం ఉండేలా తల్లి తమను పెంచారు.. ఇంటిపేరుతో సంబంధం లేకుండా తాము అన్ని పండుగలను జరుపుకొంటాం.. ఇది ఒక దేశంగా మన సంప్రదాయం’అని అన్నారు. చెన్నైలో పుట్టి పెరిగిన కమలా తల్లి శ్యామలా గోపాలన్‌.. తర్వాత అమెరికాకు వలస వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ.. చీరను ధరించడం ద్వారా ఆమెకు మరింత నైతిక బలం చేకూరుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రమాణస్వీకారం రోజున కమలా హారిస్ ఏం వస్త్రాలు ధరిస్తారనే చర్చ అంత ముఖ్యమైందా? కాదా అనేది పక్కనబెడితే.. చీరను ధరించడం బైడెన్-హారిస్ పాలన మైనారిటీలకు మంచి ప్రాతినిధ్యం వహిస్తుందనే ఉద్దేశ్యంతో ఒక ముఖ్యమైన సందేశాన్ని బలంగా పంపుతుందని కొందరు అంటున్నారు. ‘ప్రమాణస్వీకారం సమయంలో మేడం వైస్‌-ప్రెసిడెంట్‌ చక్కటి బెనారస్‌ పట్టుచీరలో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు’న్యూయార్క్‌లో స్థిరపడి ఒడిశా సంతతికి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ బిబు మొహాపాత్ర ఓ ఇంటర్వూలో చెప్పారు. ఈ సందర్భంలో ఆమెకు వస్త్రాలంకరణ చేయటం తనకు ఎంతో గౌరవం కూడా అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో కమల ‘ఆరుగజాల వస్త్ర విశేషం’ అయిన చీరనే ధరిస్తారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ రాజకీయవేత్త వాస్తవానికి ఎన్నో ఏళ్లుగా ఫార్మల్‌ సూట్లనే ధరిస్తున్నారు.. ఇప్పుడు కూడా ఆమె అదే అలవాటును కొనసాగిస్తారనే వారూ ఉన్నారు. ఇక ఆమె ఏం ధరిస్తారనేది అంత ముఖ్య విషయం కాదని కొందరంటున్నారు. అయితే ఈ అభిప్రాయం తప్పని ఓ సోషల్‌ మీడియా పోస్టు ద్వారా రుజువైంది. కమలా సమీప బంధువు మీనా హ్యారిస్‌ ఇటీవల ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో ‘ఫ్యూచర్‌ ఈజ్‌ ఫిమేల్‌’ (భవిష్యత్తు మహిళదే) అని రాసి ఉన్న సాక్సులను హారిస్‌ ధరించడం చూడవచ్చు. దీనితో సంబంధిత కంపెనీ సాక్సులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగి.. స్టాకు అందుబాటులో లేకుండా పోయింది. ‘ఆమె తనకు తగిన వస్త్రాలను ధరించబోతున్నారని నేను ఊహిస్తున్నాను.. ఆమె సాధారణంగా ధరించేది.. ఒక సూట్. ఆమె ఏళ్లతరబడి ముఖ్యంగా కాలిఫోర్నియాలో ప్రజల దృష్టిలో ఉంది.. అదే ఆమె ధరిస్తుంది. వోగ్ యుకె ఇదే విషయాన్ని పేర్కొంది: ‘హారిస్ ఎప్పుడూ సూట్లు ధరించేవారు, కానీ ఆమె స్కర్టులను ప్యాంటుతో భర్తీ చేసింది’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.


By January 19, 2021 at 07:24AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/sari-or-suit-the-buzz-around-what-us-vice-president-elect-kamala-harris-will-wear-on-inauguration/articleshow/80338752.cms

No comments