Breaking News

‘ఆదిపురుష్’ ఆరంభం: మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ.. అప్‌డేట్ వదిలిన ప్రభాస్


పాన్ ఇండియా స్టార్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో భారీ ఎత్తున నిర్మితమవుతోన్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. గుల్షన్ కుమార్ సమర్పణలో టి-సిరీస్ ఫిలింస్, రెట్రోఫిలిస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేశుడిగా నటించబోతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుంది. భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులకు తాజాగా మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మంగళవారం ఉదయం వెల్లడించారు. మోషన్ క్యాప్చర్ టీమ్‌తో కలిసి దర్శకుడు ఓం రౌత్ తీసుకున్న ఫొటోను కూడా ప్రభాస్ షేర్ చేశారు. ‘‘మోషన్ క్యాప్చర్ మొదలైంది. ‘ఆదిపురుష్’ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు’’ అని ప్రభాస్ పేర్కొన్నారు. విజువల్ ఎఫెక్ట్స్, 3డి యానిమేషన్‌లో భాగంగా మోషన్ క్యాప్చర్‌ టెక్నాలజీని ప్రస్తుతం విరివిగా వాడుతున్నారు. ప్రతి చిన్న మూమెంట్, ఎక్స్‌ప్రెషన్‌ను పర్ఫెక్ట్‌గా డెలివర్ చేయడానికి ఈ మోషన్ క్యాప్చర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ‘అవతార్’, ‘అవెంజర్స్’ లాంటి హాలీవుడ్ మూవీల్లోనూ ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడారు. రజినీకాంత్ ‘రోబో’, ‘కొచ్చాడియన్’ సినిమాలకూ ఈ టెక్నాలజీని ఉపయోగించారు. మనుషులకి మోషన్ క్యాప్చర్ సూట్ వేసి, వారి శరీరం నిండా సెన్సార్లను అతికిస్తారు. వాళ్లతో యాక్షన్ చేయించి ఆ మోషన్‌ను కంప్యూటర్‌లో క్యాప్చర్ చేస్తారు. ఆ మోషన్‌ను 3డి యానిమేషన్ క్యారెక్టర్లకు అప్లై చేస్తారు. కాగా, ‘ఆదిపురుష్’ టీమ్ మొదటిగా మోషన్ క్యాప్చర్ పనులను పూర్తిచేయనుంది. ఓవైపు గ్రాఫిక్స్ సంబంధించి పనులు చేస్తూనే మరోవైపు రియల్ క్యారెక్టర్స్‌తో షూటింగ్ చేయనుంది. ఈ చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభంకానుందని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ మాత్రమే ఖరారయ్యారు. మిగిలిన పాత్రలు ఎవరు పోషిస్తారు, సాంకేతిక నిపుణులు ఎవరు వంటి విషయాలు తెలియాల్సి ఉంది.


By January 19, 2021 at 07:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-adipurush-begins-with-motion-capture/articleshow/80338867.cms

No comments