Breaking News

చౌటుప్పల్‌లో డ్రగ్స్ డెన్.... రూ.70కోట్ల సరుకు తయారు చేసింది అక్కడేనా!


మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌లో కలకలం రేపిన డ్రగ్‌ రాకెట్‌ వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన వేదవ్యాస్ అనే వ్యక్తి 70 కిలోల డ్రగ్స్‌తో దొరికిన సంగతి తెలిసిందే. ఎండీఎంఏ మాదకద్రవ్యాల్ని అతడు హైదరాబాద్‌లోనే తయారుచేసినట్లు విచారణలో వెల్లడి కావడంతో ఆ స్థావరంపై ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు కూకట్‌పల్లి ప్రశాంతినగర్‌లో వ్యాస్‌కు చెందిన అరిస్టాన్‌ ఫార్మా నోవాటెక్‌ కంపెనీలో సోదాలు చేసినా మాదకద్రవ్యాలు తయారు చేసినట్లు ఆనవాళ్లు దొరకలేదు. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులకూ ఆ కంపెనీలో ఎలాంటి ఆధారాలేవీ దొరక్కపోవడంతో ఆ డ్రగ్‌ను ఎక్కడ తయారు చేశారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో ఎస్‌వోటీ పోలీసులు వ్యాస్ గత కదలికలపై ఆరా తీయగా అతడు తరుచూ వెళ్లేవాడని తేలింది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లోని ఏదైనా పాత పరిశ్రమలో వ్యాస్ డ్రగ్స్‌ను తయారుచేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. వ్యాస్ తరుచూ చౌటుప్పల్‌కు వెళ్లేవాడని తమ విచారణలో వెల్లడైందని, అతడిని త్వరలోనే కస్టడీపై హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఆ స్థావరాన్ని గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ డ్రగ్‌ రాకెట్‌లో వ్యాస్‌‌తో పాటు అతడి కారు డ్రైవర్‌ వెంకటేశ్‌, ఇండోర్‌కు చెందిన టెంట్‌ సప్లయర్స్‌ దినేశ్‌ అగర్వాల్‌, అతడి తనయుడు అక్షయ్‌, వారి బంధువు చిమన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇండోర్‌ పోలీసులకు ఈ దందా గురించి 15 రోజుల ముందే సమాచారం అందింది. అగర్వాల్‌ టెంట్‌ సప్లయర్స్‌ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ వ్యవహారంపై ఇండోర్‌ పోలీసులకు ఉప్పందించినట్లు తెలుస్తోంది. దీంతో అగర్వాల్‌ కదలికలపై పోలీసులు నిఘా ఉంచి.. ఖుడేల్‌ ఠాణా పరిధిలోని సానావాడియా గ్రామ శివారులో మాదకద్రవ్యాలు చేతులు మారుతుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


By January 09, 2021 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-police-suspets-grugs-den-in-choutappal-area/articleshow/80181712.cms

No comments