Breaking News

రైలు కిందపడి కర్ణాటక మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మగౌడ ఆత్మహత్య


కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మగౌడ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మృతదేహాన్ని చిక్కమంగళూరు వద్ద రైల్వేట్రాక్ పక్కన గుర్తించారు. ఘటనాస్థలిలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ధర్మగౌడ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేశారు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి ఒంటిరిగా వాహనంపై వెళ్లిన ధర్మగౌడ.. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆయన ఫోన్ కూడా స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఆయన ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పలుచోట్ల వెదికిన తర్వాత చివరకు చిక్‌మంగళూరు జిల్లా మంకెనహళ్లి సమీపంలోని గుణసాగర్ వద్ద రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించారు. ఆయన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో సుకరాయపట్నంలోని తన ఇంటికి చేరుకున్న ధర్మగౌడ.. కారును రైల్వే ట్రాక్ సమీపంలో నిలపాలని డ్రైవర్‌కు సూచించారు. అక్కడ నుంచి డ్రైవర్ పంపేశారు. ఓ వ్యక్తికి ఫోన్ చేసి జన శతాబ్ది రైలు ఎప్పుడొస్తుందని ఆరా తీశారు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ ధర్మగౌడ ఆత్మహత్య పట్ల ప్రధాని మోదీ సహా మాజీ ప్రధాని దేవెగౌడ, జేడీఎస్‌ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధర్మెగౌడ మరణం కర్ణాటకకు తీరని లోటని పేర్కొన్నారు. ఇటీవల మండలిలో చోటుచేసుకున్న పరిణామంతో డిప్యూటీ ఛైర్మన్ ధర్మగౌడ తీవ్ర మనస్థాపానికి గురయినట్టు తెలుస్తోంది. డిసెంబరు 15న గోవధ నిషేధ చట్టంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ ‌ధర్మగౌడను కుర్చీలో నుంచి లాగేశారు. ఈ పరిణామం ఒక్కసారిగా ఘర్షణకు దారి తీసింది. శాసనమండలిలో గోవధ నిషేధ బిల్లును ఆమోదించుకోవాలని బీజేపీ ప్రభుత్వం భావించింది. విధానసభలో బీజేపీకి మెజార్టీ ఉన్నా.. పరిషత్తులో కాంగ్రెస్‌కు ఆధిపత్యం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మరో నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. అయినా.. కాంగ్రెస్‌కే మెజార్టీ ఉంది. దీంతో జేడీఎస్‌ను మచ్చికచేసుకుని బిల్లును ఆమోదించుకోవాలని బీజేపీ పావులు కదిపింది. జేడీఎస్‌కు చెందిన డిప్యూటీ ఛైర్మన్ అనుకూలంగా వ్యవహరిస్తారని అనుమానించి కాంగ్రెస్ సభ్యులు ఆయనను కుర్చిలో నుంచి లాగేశారు.


By December 29, 2020 at 07:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-legislative-council-deputy-chairman-s-l-dharme-gowda-commits-suicide/articleshow/80002169.cms

No comments