Breaking News

పెళ్లిరోజే వధువుకు కరోనా.. కళ్యాణ మండపంగా కోవిడ్ సెంటర్.. పీపీఈ కిట్‌లతో వివాహం


పెళ్లి రోజే వధువుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడతో కోవిడ్-19 కేర్ సెంటర్‌లోనే వివాహం జరిగిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వధూవరులతో పాటు పురోహితుడు, అతిథులంతా పీపీఈ కిట్‌లు వివాహ తంతులో పాల్గొన్నారు. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో గత సోమవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. షాబాద్ జిల్లాకు చెందిన యువతికి ఓ యువకుడితో పెళ్లి నిశ్చయం కాగా.. నవంబరు 30 వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే, ఇంతలోనే వధువు మేనమామ, ఆయన భార్య కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో వధువు సహా ఆమె కుటుంబం మొత్తానికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల రిపోర్ట్ పెళ్లి రోజే రాగా... వధువుకు కరోనా సోకిందని వెల్లడైంది. కరోనా సోకినా ముందుగా నిశ్చయించిన ముహూర్తానికే తంతు కొనసాగించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. దీంతో కోవిడ్ కేర్ సెంటర్‌ కళ్యాణ మండపంగా మారిపోయింది. వధూవరులతోపాటు పురోహితుడు, పెళ్లికి హాజరైన అతిథుల కోసం పీపీఈ కిట్లను తెప్పించారు. అందరూ పీపీఈ కిట్లను ధరించి వివాహ వేడుకలో పాల్గొన్నారు. పీపీఈ కిట్ ధరించిన పురోహితుడు వధూవరులకు సూచనలిస్తూ పెళ్లి జరిపించారు. వరుడు చేతికి గ్లౌజులతో పాటు పీపీఈ కిట్ వేసుకొని తలపాగా ధరించారు. వధువు పీపీఈ కిట్ తోపాటు ఫేస్ షీల్డ్, చేతికి గ్లౌజులు ధరించి గౌరిపూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పీపీఈ కిట్ల మధ్య జరిగిన పెళ్లిని కరోనా పెళ్లిగా అతిథులు అభివర్ణించారు. కోవిడ్-19 నిబంధనల ప్రకారమే ఈ వివాహం జరిగిందని, పురోహితుడితోపాటు పెళ్లికి వచ్చిన అందరూ పీపీఈ కిట్స్ ధరించారని బరాన్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంపత్ రాజ్ నగర్ అన్నారు. వధువు కిషన్‌గంజ్ ప్రాంతంలోని నహర్‌గఢ్‌కు చెందిన అమ్మాయని తెలిపారు. వధువు కరోనా బారినపడటంతో వివాహం వాయిదావేసుకోవాలని అధికారులు తొలుత సూచించారు. కోలుకున్న తర్వాత మరో ముహూర్తంలో వివాహం చేయాలని, వధువును కోవిడ్ కేంద్రానికి తరలించారు. అయితే, ఇరు కుటుంబాలు దీనికి అంగీకరించక.. నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి జరిపించాలని పట్టుబట్టారు. దీంతో అధికారులు పెట్టిన షరతులకు అంగీకరించి, నిబంధనల ప్రకారం పీపీఈ కిట్లు ధరించి, వివాహ తంతులో పాల్గొన్నారు. తర్వాత వధువును అక్కడే అడ్మిట్ చేసిన వెళ్లిపోయారు. వధువు తల్లికి కూడా వైరస్ నిర్ధారణ అయ్యింది. వరుడికి కూడా అనుమానిత లక్షణాలుండటంతో కోవిడ్ కేంద్రంలోనే ఉంచారు. అతడి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు.


By December 07, 2020 at 10:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bride-tests-positive-for-covid-19-gets-married-at-covid-care-centre-in-rajasthan/articleshow/79602068.cms

No comments